నాగార్జున `అన్నమయ్య`కి పాతికేళ్ళు!
on May 21, 2022
తెలుగు యవనికపై ఎన్నో చిత్రాలు సందడి చేశాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. అలాంటి చిత్రాల్లో 1997 నాటి `అన్నమయ్య` ఒకటి. నటుడిగా `కింగ్` నాగార్జునకి ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చిన ఈ అద్భుత ఆధ్యాత్మిక చిత్రం.. అటు దర్శకుడిగా కె. రాఘవేంద్రరావుకి, ఇటు సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణికి కూడా శిఖరాగ్ర స్థాయి గుర్తింపుని తెచ్చింది. అంతేకాదు.. ఇతర భాషల్లో అనువాద రూపంలోనూ జయకేతనం ఎగరవేసి అనేక పురస్కారాలను సొంతం చేసుకుంది.
`బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్`, `స్పెషల్ మెన్షన్` (నాగార్జున) విభాగాల్లో ప్రతిష్ఠాత్మక `జాతీయ` అవార్డులను అందుకున్న `అన్నమయ్య`.. `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ నటుడు`, `ఉత్తమ అనువాద కళాకారుడు` (ఎస్పీ బాలసుబ్రమణ్యం), `ఉత్తమ కళా దర్శకుడు` (వి. భాస్కర రాజు), `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` (ఎ. విన్సెంట్), `ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్` (తోట బాబు రావు), `ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్` (టి. మల్లికార్జున రావు) విభాగాల్లో `నంది` పురస్కారాలను సొంతం చేసుకుంది. అలాగే `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటుడు`, `ఉత్తమ దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ పేర్` అవార్డ్స్ ని కైవసం చేసుకుంది.
తాళ్ళపాక అన్నమాచార్య జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో `అన్నమయ్య`గా టైటిల్ రోల్ లో నాగ్ నటించగా.. శ్రీ వేంకటేశ్వర స్వామిగా సుమన్ దర్శనమిచ్చారు. మోహన్ బాబు, రమ్యకృష్ణ, కస్తూరి, భానుప్రియ, శ్రీకన్య, రోజా, ఎం. బాలయ్య, శుభ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, మల్లికార్జునరావు, ఏవీయస్, శివపార్వతి, సుత్తి వేలు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రముఖ రచయిత జేకే భారవి ఈ సినిమాకి కథ, మాటలు అందించారు.
ఆడియో పరంగా సంచలనం సృష్టించిన `అన్నమయ్య`లో బిట్ సాంగ్స్ తో సహా మొత్తం 20 గీతాలున్నాయి. వాటిలో 16 పాటలు అన్నమయ్య కీర్తనలతోనే రూపొందగా.. మూడు పాటలను దిగ్గజ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి, ఒక గీతాన్ని జేకే భారవి పదరచన చేశారు. వీఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మించిన `అన్నమయ్య`.. 1997 మే 22న విడుదలై జననీరాజనాలను అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలనూ పొందింది. అదే విధంగా 42 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాలలో 176 రోజులు ప్రదర్శితమైంది. కాగా, ఈ ఆదివారంతో ఈ క్లాసిక్.. పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది.
Also Read