'శేఖర్'కు చిక్కులు.. రూ. 65 లక్షలు కట్టకపోతే అంతే!
on May 21, 2022
డాక్టర్ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వం వహించిన 'శేఖర్' సినిమా శుక్రవారం (మే 20) విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఆ చిత్రం కోసం తన దగ్గర రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్న నిర్మాత,దర్శకురాలు శ్రీమతి జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ ఎ. పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 48 గంటల లోపు అనగా ఆదివారం సాయంత్రం 4:30 గంటలు లోపు రూ. 65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలని ఆదేశించింది.
ఒకవేళ అలా డిపాజిట్ చేయలేని పక్షంలో ''శేఖర్" సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్మెంట్ చేస్తూ.. అంటే థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ వంటి వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో కానీ సినిమా తోపాటు ట్రైలర్స్, పాటలతో సహా ఎలాంటి కంటెంట్ ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అటాచ్మెంట్ అమలులోకి వస్తే, ఆదివారం సాయంత్రం తర్వాత 'శేఖర్" సినిమాను ఏ ప్లాట్ఫామ్లోనైనా ఎవరు ప్రదర్శించినా CONTEMPT OF COURT అవుతుందని పరంధామరెడ్డి హెచ్చరించారు.
కాగా, మలయాళం హిట్ ఫిల్మ్ 'జోసెఫ్'కు రీమేక్ అయిన 'శేఖర్'కు ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ మూవీలో ఆత్మీయ రాజన్, శివానీ రాజశేఖర్, ముస్కాన్, కన్నడ కిశోర్, సమీర్, భరణి, రవివర్మ, పోసాని కృష్ణమురళి, ప్రకాశ్ రాజ్ (గెస్ట్ అప్పీరెన్స్) నటించారు.