ENGLISH | TELUGU  

వెంకీ, సౌంద‌ర్య 'ప‌విత్ర బంధం'కి పాతికేళ్ళు.. విశేషాలెన్నో!

on Oct 16, 2021

భార‌తీయ వివాహ వ్య‌వ‌స్థ గొప్ప‌ద‌నాన్ని చాటి చెప్పిన తెలుగు చిత్రాల్లో `ప‌విత్ర బంధం`(1996) ఒక‌టి.  విక్ట‌రీ వెంక‌టేశ్, అభినేత్రి సౌంద‌ర్య జంటగా న‌టించిన ఈ ఫ్యామిలీ డ్రామాని సెంటిమెంట్ సినిమాల స్పెష‌లిస్ట్ ముత్యాల సుబ్బ‌య్య రూపొందించారు. గీతా చిత్ర ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌తాకంపై సి. వెంక‌ట్రాజు, జి. శివ‌రాజు నిర్మించిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీకి స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందించారు. ఈ అక్టోబ‌ర్ 17తో పాతికేళ్ళు పూర్తిచేసుకుంటున్న సంద‌ర్భంగా.. `ప‌విత్ర బంధం` జ్ఞాప‌కాల్లోకి వెళితే..

క‌థాంశం:
విశ్వ‌నాథం (ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం) ఓ మ‌ల్టి మిలియ‌నీర్. అమెరికాలో పెరిగిన అత‌ని కొడుకు విజ‌య్ (వెంక‌టేశ్).. ఎలాంటి ల‌క్ష్యం లేకుండా జాలీగా గ‌డుపుతుంటాడు. దీంతో.. అత‌నికి పెళ్ళి చేసి దారిలోకి తీసుకురావాల‌నుకుంటాడు విశ్వ‌నాథం. తండ్రి ఒత్తిడి మేర‌కు త‌న‌కు ఇష్టం లేక‌పోయినా.. ఓ విచిత్ర‌మైన ష‌ర‌తు పెట్టి  పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకుంటాడు విజ‌య్. ఇంత‌కీ ఆ ష‌ర‌తు ఏంటంటే.. ఓ ఏడాది పాటు కాపురం చేశాక వైవాహిక జీవితం న‌చ్చితే కొన‌సాగ‌డం లేదంటే విడిపోవ‌డం. అలా.. విజ‌య్ జీవితంలోకి విశ్వ‌నాథం ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ అయిన రాధ (సౌంద‌ర్య‌) ప్ర‌వేశిస్తుంది. ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ కి తొలుత ఒప్ప‌కోక‌పోయినా ఇంట్లో ఆర్ధిక ప‌రిస్థితుల దృష్ట్యా త‌ప్ప‌క‌ అంగీకరిస్తుంది రాధ‌.  అయితే,  ఏడాది గ‌డిచాకా విడిపోవాల‌నే నిర్ణ‌యించుకుంటాడు విజ‌య్. దీంతో పుట్టింటికి వెళ్ళ‌పోతుంది రాధ‌. త‌న నుంచి రాధ విడిపోయాక ఆమె గొప్ప‌త‌నం తెలిసొస్తుంది విజ‌య్ కి. అత‌ని ఆలోచ‌నావిధానంలో క్ర‌మంగా మార్పు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో.. రాధ‌కి మ‌ళ్ళీ ద‌గ్గ‌ర‌వ‌డానికి విజ‌య్ ఏం చేశాడు?  చివ‌ర‌కి ఇద్ద‌రు ఎలా ఒక్క‌ట‌య్యారు? అనేదే `ప‌విత్ర బంధం` క‌థాంశం.

విశేషాలుః
* వెంక‌టేశ్ కాంబినేష‌న్ లో ముత్యాల సుబ్బ‌య్య చేసిన మొద‌టి సినిమా ఇది. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబోలో `పెళ్ళి చేసుకుందాం` (1997) వ‌చ్చింది. ఈ రెండు సినిమాల్లోనూ సౌంద‌ర్య‌నే క‌థానాయిక కావ‌డం విశేషం. అంతేకాదు.. గీతాచిత్ర ఇంటర్నేష‌న‌ల్ సంస్థ‌నే ఈ చిత్రాల‌ని నిర్మించింది. అలాగే పోసాని కృష్ణ‌ముర‌ళి (సంభాష‌ణ‌లు), భూప‌తి రాజా (క‌థ‌), కె. ర‌వీంద్ర‌బాబు (ఛాయాగ్ర‌హ‌ణం), గౌత‌మ్ రాజు (కూర్పు).. ఇలా ప్ర‌ధాన సాంకేతిక వ‌ర్గం కూడా రిపీట్ అయింది. అదేవిధంగా.. కొంత‌మంది న‌టీన‌టులు కూడా పున‌రావృత‌మ‌య్యారు.
*1996లో వెంకీ, సౌంద‌ర్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన రెండో చిత్రమిది. `ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు`తో అదే ఏడాది ఈ జోడీ ఆక‌ట్టుకుంది.
* కీర‌వాణి కాంబినేష‌న్ లో వెంక‌టేశ్ న‌టించిన చివ‌రి సినిమా ఇది.
* ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టి (సౌంద‌ర్య‌), ఉత్త‌మ స‌హాయ‌క న‌టుడు (ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం) విభాగాల్లో `నంది` పుర‌స్కారాలు ద‌క్కించుకుందీ సినిమా.
* `ప‌విత్ర బంధం`.. మొత్తం ఆరు భాష‌ల్లో రీమేక్ అయింది. ఒరియాలో `సుహాగ్ సింధూర‌`, క‌న్న‌డంలో `మాంగ‌ళ్యం తంతునేనా`, హిందీలో `హ‌మ్ అప్కే దిల్ మే ర‌హ్తా మై`, బంగ్లాదేశీ బెంగాలీలో `యే బదోన్ జ‌బేన చిరే`, త‌మిళంలో `ప్రియ‌మాన‌వ‌లే`, బెంగాలీలో `సాత్ పాకే బంధ‌` టైటిల్స్ తో పున‌ర్నిర్మిత‌మైంది.
* సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సాహిత్యంలో కేజే యేసుదాసు ఆల‌పించిన ``అపురూప‌మైనద‌మ్మ ఆడ‌జ‌న్మ‌`` గీతం.. ఆ ఏడాది చార్ట్ బ‌స్ట‌ర్స్ లో ఒక‌టిగా నిలిచింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.