
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం కమర్షియల్ రిజల్ట్ కంటే.. వాటిలోని ప్రత్యేకతతో ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ‘డాడీ’ కూడా ఒకటి.
2001 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డాడీ’కి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటే.. కేవలం చిరంజీవి నటించిన ఓ ఫ్యామిలీ డ్రామా కంటే చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.
‘డాడీ’కి ముందు చిరంజీవి అంటే మాస్, యాక్షన్, కామెడీ, డ్యాన్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి సమయంలో ఆయన ఓ కుటుంబ కథలో తండ్రి పాత్రను ప్రధానంగా తీసుకోవడం అప్పట్లోనే చాలా కొత్త ప్రయత్నం.
కథను మొదట విన్నప్పుడు చిరంజీవికి ఈ సినిమా తన కంటే వెంకటేష్ చేస్తే ఇంకా బాగా సెట్ అవుతుందనే అభిప్రాయం కలిగిందట. కుటుంబ కథలకు వెంకటేష్ అప్పటికే బాగా కనెక్ట్ అయి ఉండటంతో.. ఈ పాత్ర ఆయనకు మరింత సహజంగా ఉంటుందని చిరంజీవి భావించారట. అయితే రచయిత భూపతిరాజా మాత్రం చిరంజీవి ఇమేజ్‌కు ఇది కొత్తగా ఉంటుందని చెప్పి ఒప్పించారట.
‘డాడీ’కి మంచి స్పందన వచ్చినప్పటికీ.. చిరంజీవి రేంజ్‌లో భారీ కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటి ప్రేక్షకులకు చిరంజీవిని ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలో చూడటం కొత్తగా అనిపించడంతో కొంత మిశ్రమ స్పందన కూడా వచ్చింది.
ఇక ఈ సినిమా ప్రత్యేకత గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు తప్పకుండా గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ తొలిసారి వెండితెరపై కనిపించారు. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్లు. ‘డాడీ’లో డ్యాన్స్ స్టూడెంట్‌గా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2003లో ‘గంగోత్రి’తో హీరోగా పరిచయమైన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
‘డాడీ’లోని యాక్షన్ సన్నివేశాలకు విక్రమ్ ధర్మతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కొరియోగ్రఫీ చేయడం మరో ఆసక్తికరమైన విషయం. అప్పటికే పవన్ కళ్యాణ్ యాక్షన్, స్టైల్‌కు మంచి క్రేజ్ ఉంది. అన్నయ్య చిరంజీవి సినిమాలో ఫైట్స్ విషయంలో ఆయన భాగస్వామ్యం కావడం అభిమానులకు ప్రత్యేకమైన విషయంగా నిలిచింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన సిమ్రాన్ హీరోయిన్‌గా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, ఆషిమా భల్లా, శరత్‌బాబు, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్. నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమాలో చిరంజీవి చేసిన గొప్ప విషయం.. తన స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పాత్రలోకి వెళ్లడం. మాస్ ఇమేజ్ ఉన్న స్టార్‌గా కాకుండా.. కుటుంబం కోసం త్యాగం చేసే తండ్రిగా, భార్యతో అనుబంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే భర్తగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటనలోని సున్నితత్వం అప్పటి ప్రేక్షకులకే కాదు.. ఇప్పటికీ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.
అందుకే ‘డాడీ’ కమర్షియల్‌గా చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద విజయాల జాబితాలో లేకపోయినా.. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని చూపించిన సినిమాగా మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి: 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'కి బిగ్ షాక్.. సెలబ్రిటీ ప్రమోషన్స్ కూడా పని చేయలేదా.?
[25 Years For Daddy Movie, Daddy Movie 25 Years, 25 Years Of Daddy Movie, Chiranjeevi Daddy Movie, Megastar Chiranjeevi, Allu Arjun, Pawan Kalyan, Telugu Film News]
.webp)





