Home

»

Latest News

2021 జ్ఞాప‌కాలుః బౌన్స్ బ్యాక్ స్టార్స్!

Dec 4, 2021 10:19AM

   


కొంత‌మంది స్టార్స్ కి 2021 సంవ‌త్స‌రం బౌన్స్ బ్యాక్ ఇయ‌ర్ గా నిలిచింది. వ‌రుస ఫ్లాప్స్ తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స్టార్స్ .. ఈ ఏడాది మ‌ళ్ళీ విజ‌యాలు అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ స్టార్స్ ఎవ‌రంటే..

ర‌వితేజః- `ట‌చ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని`, `డిస్కో రాజా`.. ఇలా నాలుగు వ‌రుస ప‌రాజ‌యాల‌తో ట్రాక్ త‌ప్పిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కి.. ఈ ఏడాది `క్రాక్` రూపంలో సెన్సేష‌న‌ల్ హిట్ దక్కింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ కాప్ డ్రామాలో ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా మెస్మ‌రైజ్ చేశారు ర‌వితేజ‌. అలాగే త‌న ఖాతాలో మ‌రో మ‌ర‌పురాని విజ‌యాన్ని జ‌మ చేసుకున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న `క్రాక్` జ‌నం ముందు నిలిచింది.

`అల్ల‌రి` న‌రేశ్ః- `సుడిగాడు` త‌రువాత క‌థానాయ‌కుడిగా ర‌క‌ర‌కాల‌ ప్ర‌యోగాలు చేసినా.. డ‌జ‌నుకి పైగా అప‌జ‌యాలు చూశారు హాస్య చిత్రాల క‌థానాయ‌కుడు `అల్ల‌రి` న‌రేశ్. ఎట్ట‌కేల‌కు.. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క్రైమ్ కోర్ట్ డ్రామా `నాంది`తో అత‌ని నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఇందులో ఇదివ‌రకెన్న‌డూ క‌నిపించ‌ని స‌రికొత్త పాత్ర‌లో ఆక‌ట్టుకున్నారాయ‌న‌. ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌లైన `నాంది`తో న‌రేశ్ మ‌ళ్ళీ స‌క్సెస్ బాట ప‌ట్టారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ః- `అత్తారింటికి దారేది` రూపంలో ఇండ‌స్ట్రీ హిట్ సొంతం చేసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఆ త‌రువాత ఆ స్థాయి విజ‌యాలను అందుకోలేక‌పోయారు. త‌ను కీల‌క పాత్ర‌లో న‌టించిన `గోపాల గోపాల‌` ఎబౌవ్ యావ‌రేజ్ గా నిలవ‌గా..  హీరోగా న‌టించిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్`, `కాట‌మ‌రాయుడు`, `అజ్ఞాత‌వాసి` నిరాశ‌ప‌రిచాయి. స్వ‌ల్ప విరామం త‌రువాత వెండితెర‌పై సంద‌డి చేసిన `వ‌కీల్ సాబ్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ అందుకున్నారు ప‌వ‌న్. ఇందులో తొలిసారిగా లాయ‌ర్ పాత్ర‌లో ఎంట‌ర్టైన్ చేశారు ఈ కొణిదెల స్టార్. ఏప్రిల్ 9న ఉగాది కానుక‌గా `వ‌కీల్ సాబ్` రిలీజైంది.

బాల‌కృష్ణః- `జై సింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`, `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`, `రూల‌ర్` రూపంలో హ్యాట్రిక్ ఫ్లాప్స్ చూసిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. తాజాగా విడుద‌లైన `అఖండ‌`తో సెన్సేష‌న‌ల్ హిట్ సొంతం చేసుకున్నారు. త‌న స్థాయికి త‌గ్గ విజ‌యంతో బౌన్స్ బ్యాక్ అయి మ‌ళ్ళీ వార్త‌ల్లో నిలిచారు. డిసెంబ‌ర్ 2న ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com