గోపీచంద్ `యజ్ఞం`కి 18 ఏళ్ళు!
on Jul 2, 2022

తెలుగునాట ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `యజ్ఞం` ఒకటి. మ్యాచో స్టార్ గోపీచంద్ కి కథానాయకుడిగా తొలి విజయాన్ని అందించిన ఈ సినిమాని ఎ.ఎస్. రవికుమార్ చౌదరి రూపొందించాడు. ఇందులో గోపీచంద్ కి జోడీగా సమీరా భరద్వాజ్ నటించగా దేవరాజ్, ప్రకాశ్ రాజ్, విజయరంగరాజు, సుమన్ శెట్టి, రఘుబాబు, ఝాన్సీ, జాహ్నవి, ధర్మవరపు సుబ్రమణ్యం, నర్రా వెంకటేశ్వరరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కథాంశం విషయానికి వస్తే.. రెడ్డప్ప (దేవరాజ్) ఓ ఫ్యాక్షనిస్ట్. అతని దగ్గర అనుచరుడిగా పనిచేసే శీను (గోపీచంద్), రెడ్డప్ప కూతురు శైలజ (సమీరా) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. పెద్దయ్యాక ప్రేమలో పడ్డ శీను, శైలుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే పాయింట్ తో `యజ్ఞం` తెరకెక్కింది.
మెలోడీబ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `యజ్ఞం`కి ప్రధాన బలంగా నిలిచాయి. పాటల్లో ``చిన్ననాటి చెలికాడే``, ``తొంగి తొంగి``, ``ఏం చేశావో నా మనసు``, ``హాయిగా అమ్మ ఒళ్ళో``, ``చమక్ చమక్ మని`` విశేషాదరణ పొందాయి. ఈతరం ఫిల్మ్స్ సంస్థ అధినేత పోకూరి బాబూరావు నిర్మించిన `యజ్ఞం`.. తమిళ్ లో `మన్నిన్ మైందన్`, ఒరియాలో `మో మన ఖాలి తోరి పెయిన్` పేర్లతో రీమేక్ అయింది. అలాగే, `ఉత్తమ హాస్య నటుడు` (ధర్మవరపు సుబ్రమణ్యం), `ఉత్తమ హాస్య నటి` (జాహ్నవి) విభాగాల్లో `నంది` అవార్డులు దక్కించుకుంది. 2004 జూలై 2న విడుదలై మంచి విజయం సాధించిన `యజ్ఞం`.. నేటితో 18 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



