Home

»

Latest News

17 ఏళ్ళ మగధీర.. తెలుగు సినిమా రూపురేఖలు మార్చిన విజువల్ వండర్.!

Jul 30, 2026 4:44PM

కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, పరిశ్రమ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తాయి. అటువంటి అరుదైన దృశ్య కావ్యం 'మగధీర'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2009 జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అప్పటివరకు ఉన్న అన్ని సౌత్ ఇండియన్ సినిమా రికార్డులను తుడిచిపెట్టేసి, తెలుగు సినిమా స్టామినాను ప్రపంచస్థాయికి చాటిచెప్పిన ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది.

రూ. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన 'మగధీర', విడుదలైన తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పట్లోనే దాదాపు రూ. 75 కోట్ల షేర్ వసూలు చేసి, రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన మొదటి తెలుగు చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

రామ్ చరణ్ కెరీర్‌లో కేవలం రెండో సినిమాగానే వచ్చిన 'మగధీర', ఆయనను తిరుగులేని స్టార్‌గా నిలబెట్టింది. కాలభైరవ పాత్రలో రామ్ చరణ్ చూపించిన వీరత్వం, గుర్రపు స్వారీ, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా 100 మంది యోధులతో కాలభైరవుడు చేసే ఆ వీరోచిత పోరాట ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన సీన్లలో ఒకటిగా నిలిచిపోయింది. రామ్ చరణ్ నటనకు, యాక్షన్ సీక్వెన్సులకు విమర్శకుల నుండి సైతం భారీ ప్రశంసలు దక్కాయి.

ఈ విజువల్ వండర్‌లో కాజల్ అగర్వాల్ 'మిత్రవింద', 'ఇందు' పాత్రల్లో తన నటనతో, సౌందర్యంతో మెప్పించింది. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. కీరవాణి స్వరపరిచిన ప్రతి పాట ఇప్పటికీ సంగీతాభిమానుల గుండెల్లో మారుమోగుతూనే ఉంది. 'బంగారు కోడిపెట్ట' రీమిక్స్ పాట నుండి 'పంచదార బొమ్మ' వరకు ప్రతి పాట కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

అప్పటివరకు సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కే పరిమితమైన తెలుగు సినిమాను, పునర్జన్మల నేపథ్యంతో కూడిన విజువల్ గ్రాండియర్ డ్రామాగా మలచడంలో రాజమౌళి విజయం సాధించారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అద్భుతమైన విజువల్స్ తో.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అంతర్జాతీయ చిత్రాలకు అప్పుడే పునాది వేశారు. 17 ఏళ్లు పూర్తయినా కూడా 'మగధీర' అందించిన ఆ సంచలన అనుభూతి తెలుగు సినీ ప్రేక్షకులలో నేటికీ చెక్కుచెదరకుండా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

 

Magadheera, SS Rajamouli, Ram Charan

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com