Home

»

Latest News

రామ్ చ‌ర‌ణ్ తొలి చిత్రం `చిరుత‌`కి 14 ఏళ్ళు!

Sep 28, 2021 12:52PM

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా తెరంగేట్రం చేసినా.. అన‌తికాలంలోనే త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. తొలి అడుగుల్లోనే తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుని.. క్ర‌మేణా `మిస్ట‌ర్ బాక్సాఫీస్`గా ఎదిగాడు చ‌ర‌ణ్. అలాంటి.. చర‌ణ్ మొద‌టి అడుగుకి వేదిక‌గా నిలిచిన చిత్రం `చిరుత‌`. చిరు త‌న‌యుడిని తెర‌పై తొలిసారిగా ఎలా చూడాల‌ని మెగాభిమానులు ఆశించారో.. అందుకు త‌గ్గ‌ట్టుగానే న‌వ‌ర‌సాలు మిళిత‌మైన పాత్ర‌తో సిల్వ‌ర్ స్క్రీన్ పై చ‌ర‌ణ్ ని ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. న‌ట‌న‌, న‌ర్త‌నం, సంభాష‌ణ‌లు ప‌లికే తీరు.. ఇలా ప్ర‌తీ అంశంలో చిరుని జ్ఞ‌ప్తికి తెస్తూ.. `చిరుత‌`గా చెల‌రేగిపోయాడు చ‌ర‌ణ్. మొద‌టి సినిమాతోనే రికార్డుల వ‌ర్షం కురిపించాడు. `బెస్ట్ డెబ్యూ హీరో`గా `ఫిల్మ్ ఫేర్`ని.. అలాగే `నంది` స్పెష‌ల్ జ్యూరీ (బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ డెబ్యూ ఫిల్మ్)ని సొంతం చేసుకున్నాడు.

రామ్ చ‌ర‌ణ్ కి జంట‌గా నేహా శ‌ర్మ న‌టించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, బ్ర‌హ్మానందం, అలీ, వేణు మాధ‌వ్, శ్రీ‌నివాస రెడ్డి, సాయాజీ షిండే, డేనియ‌ల్ బాలాజీ, ఎమ్మెస్ నారాయ‌ణ‌, ధ‌ర్మ‌వ‌రపు సుబ్ర‌మ‌ణ్యం, బండ్ల గ‌ణేశ్, స‌త్యం రాజేశ్, ప్ర‌గ‌తి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించ‌గా.. త‌నికెళ్ళ భ‌ర‌ణి, సూర్య అతిథి పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు.

మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. టైటిల్ సాంగ్ తో పాటు ``య‌మ‌హో య‌మ‌``, ``ల‌వ్ యూ రా``, ``ఎందుకో పిచ్చి పిచ్చిగా``, ``ఇవాళే`, ``మారో మారో`` వంటి పాట‌లు కూడా కుర్ర‌కారుని ఫిదా చేశాయి. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సి. అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ చిత్రం.. 178 కేంద్రాల‌లో 50 రోజులు, 40 కేంద్రాల‌లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైంది. 2007 సెప్టెంబ‌ర్ 28న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు కానుక‌గా విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన `చిరుత‌`.. నేటితో 14 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com