'పిల్ల జమీందార్'గా నాని ఎంటర్టైన్ చేసి నేటికి పదేళ్ళు!
on Oct 14, 2021

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమాల్లో `పిల్ల జమీందార్` ఒకటి. `అలా మొదలైంది` (2011) వంటి బ్లాక్ బస్టర్ తరువాత నాని నుంచి వచ్చిన ఈ చిత్రం కూడా విజయపథంలో పయనించింది. దక్షిణ కొరియా చిత్రం `ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్` (2006) ఆధారంగా రూపొందిన ఈ న్యూ ఏజ్ కామెడీ డ్రామాని జి. అశోక్ డైరెక్ట్ చేశారు. ఇందులో నానికి జోడీగా హరిప్రియ, బిందు మాధవి నటించగా నాగినీడు, రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్, ఎమ్మెస్ నారాయణ, ధనరాజ్, తాగుబోతు రమేశ్, రణధీర్ గట్లా, సత్య, వెన్నెల కిశోర్, నర్సింగ్ యాదవ్, రఘు కారుమంచి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. మేఘనా నాయుడు ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.
జమీందార్ కుటుంబానికి చెందిన ప్రవీణ్ జయరామరాజు అలియాస్ పీజే కథే `పిల్ల జమీందార్`. కోపిష్టి యువకుడైన పీజే.. ఆస్తి కోసం తన తాతయ్య పెట్టిన షరతులకు అనుగుణంగా ఎలా నడుచుకున్నాడు? ఈ క్రమంలో ఏం నేర్చుకున్నాడు? అన్నదే ఈ సినిమా. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి నాని నటన, జి. అశోక్ దర్శకత్వప్రతిభ, భావోద్వేగాలు ప్రధాన బలంగా నిలిచాయి. సెల్వగణేశ్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని డీఎస్ రావు నిర్మించారు. 2011 అక్టోబర్ 14న విడుదలై మంచి విజయం సాధించిన `పిల్ల జమీందార్`.. నేటితో 10 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



