![]() |
![]() |

వాణిజ్యాత్మక చిత్రాలకు సామాజిక సందేశాలను జోడిస్తూ.. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు కొరటాల శివ. రచయితగా కెరీర్‌ను ఆరంభించిన కొరటాల.. 2013లో విడుదలైన ‘మిర్చి’తో దర్శకుడి అవతారమెత్తాడు. మొదటి ప్రయత్నంతోనే ఘనవిజయం అందుకుని పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. ఆపై ‘శ్రీమంతుడు’(2015), ‘జనతా గ్యారేజ్’(2016), ‘భరత్ అనే నేను’(2018) వంటి మరో మూడు విజయవంతమైన చిత్రాలను అందించాడు. ప్రస్తుతం.. ‘ఆచార్య’ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలి చిత్రం ‘మిర్చి’ నుండి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘ఆచార్య’ వరకు అగ్ర కథానాయకుల కాంబినేషన్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు కొరటాల. ప్రభాస్‌తో ‘మిర్చి’, మహేశ్ బాబుతో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, జూనియర్ యన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ రూపొందించిన కొరటాల.. ‘ఆచార్య’ని మెగాస్టార్ చిరంజీవి, అతని తనయుడు రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్నాడు. కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆచార్య’ త్వరలోనే మలివిడత చిత్రీకరణకు సన్నద్ధమవుతోంది. అన్నీ కుదిరితే 2021 సంక్రాంతికి ‘ఆచార్య’ జనం ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ విడుదలకు ముందే కొరటాల తన నెక్స్ట్ వెంచర్‌ని సెట్ చేసుకున్నాడని టాక్. అంతేకాదు.. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఉంటుందని వినికిడి. అలాగే.. ఓ స్టార్ హీరో కాంబినేషన్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని వినిపిస్తోంది. ఆ స్టార్ మరెవరో కాదు.. ఈ సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురములో’ రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్న అల్లు అర్జున్. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. అటు అల్లు అర్జున్ ‘పుష్ప’తోనూ, ఇటు కొరటాల ‘ఆచార్య’తోనూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే బన్నీ, కొరటాల కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరి.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీతో కొరటాల బెస్ట్ రిజల్ట్‌ని అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |