![]() |
![]() |

భారత చలనచిత్ర సీమలో నటదిగ్గజాలు అయిన శ్రీదేవి, కమల్ హాసన్, రజినీకాంత్ ప్రధాన పాత్రలు పోషించగా భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'పదినారు వయదినిలేస'. దర్శకునిగా భారతీరాజాకు ఇదే తొలి చిత్రం. ఇది 4 రాష్ట్రీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి జాతీయ పురస్కారాన్ని మరియు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి,అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రానికి తెలుగులో 'నీకోసం నిరీక్షణ' టైటిల్ పెట్టారు.
ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంతరం మరో అయిదు భాషల్లో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఈ సందర్భంగా నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ, "మధురమైన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా 5 పాటలను విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గట్లుగా మార్పులు చేసి మీ ముందుకు తీసుకువస్తున్నాం" అన్నారు.
కాగా ఇదే సినిమాను శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు ప్రధాన పాత్రధారులుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ చేశారు. అది కూడా ఘన విజయం సాధించింది.
![]() |
![]() |