![]() |
![]() |

కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలు పైబడినవారు, 8 సంవత్సరాల లోపు ఉన్నవారు ఇళ్లకే పరిమితం కావాలి. బయట తిరగకూడదు. ఆ నిబంధనను టాలీవుడ్‌కు అప్లై చేస్తే, చాలా మంది హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు షూటింగ్‌ల కోసమని బయటకు రాకూడదు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, అక్కినేని నాగార్జున సీనియర్ సిటిజెన్స్ కిందకు వస్తారు. వాళ్లు 60 ఏళ్ల వయసును దాటారు. అంటే వాళ్లు షూటింగ్ సెట్స్‌కు రాకూడదు. అలాగే చాలా మంది పేరు పొందిన సీనియర్ ఆర్టిస్టులకు కూడా ఇదే వర్తిస్తుంది.
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సినిమా షూటింగ్స్‌లో 60 ఏళ్లు లేదా 65 ఏళ్లు పైబడిన వాళ్లను అనుమతించడం లేదు. కానీ సినిమా షూటింగ్స్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వయసు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. షూటింగ్‌లు పునఃప్రారంభించుకోడానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. అందులో నటుల వయసును ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించలేదనే విమర్శలు వస్తున్నాయి. కారణం కేసీఆర్‌ను కలిసొచ్చిన స్టార్లలో చిరంజీవి, నాగార్జున సీనియర్ సిటిజెన్లు కావడం. వయసు నిబంధనలు విధిస్తే వీళ్లెవరూ షూటింగ్‌లకు వెళ్లడానికి వీలవదు. అందుకే సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతుతో జీవోలో ఆ నిబంధన లేకుండా చేశారని అంటున్నారు.
ఈ జీవో మద్దతుతో 'ఆచార్య' షూటింగ్‌కు చిరంజీవి, బోయపాటి సినిమా షూటింగ్‌కు బాలకృష్ణ, 'వైల్డ్ డాగ్' సెట్స్‌పైకి నాగార్జున వెళ్లే వెసులుబాటు కలిగింది. వెంకటేశ్ సైతం ఈ డిసెంబర్‌కు 60 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయనకూ ఈ ఇబ్బంది తప్పినట్లే.
![]() |
![]() |