![]() |
![]() |
![]()
ప్రతిష్ఠాత్మక జేమ్స్ కామెరాన్ సినిమా 'అవతార్ 2' షూటింగ్ న్యూజిలాండ్‌లో పునఃప్రారంభమైంది. ప్రపంచంలో అనేక దేశాలు కరోనా మహమ్మారితో కుదేలవుతుంటే, న్యూజిలాండ్ మాత్రం ఆ భయంకర మహమ్మారిని నిరోధించడంలో సఫలమైంది. అందుకే అక్కడ ఇతర కార్యకలాపాలతో పాటు సినిమా షూటింగ్‌లు కూడా ఏ ఇబ్బందీ లేకుండా జరుగుతున్నాయి. రెండు వారాల క్వారంటైన్ టైమ్‌ను పూర్తి చేసుకున్న యూనిట్‌తో షూటింగ్‌ను తిరిగి కొనసాగిస్తున్నామని 'అవతార్' ఫ్రాంచైజ్ ప్రొడ్యూసర్ జోన్ లాండౌ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. దాంతో పాటు కెమెరాలతో యూనిట్ షూట్ చేస్తున్న ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు. అయితే విదేశీ చిత్రాల షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంపై న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రతిపక్షాలు నిలదీస్తుండటం గమనార్హం.
జాన్ లాండౌ షేర్ చేసిన ఫొటో ఇండోర్‌కు సంబంధించింది. అందులో పలు బ్లూ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. ఒక చైర్‌లో జేమ్స్ కామెరాన్ కూర్చొని ఉన్నాడు. అక్కడ వాళ్లు ఏం షూట్ చేస్తున్నారో ఇమాజినేషన్‌కు కూడా అందడం లేదు. కేవలం కొన్ని కెమెరాలు, స్క్రీన్లు తప్ప చూడ్డానికి ఆ పిక్చర్‌లో ఏం కనిపించడం లేదు. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయితే తప్ప, కామెరాన్ ఏం తీస్తున్నాడో ఎవరికీ తెలీదని చెప్పుకుంటున్నారు. 'అవతార్ 2'తో పాటు మరో రెండు సీక్వెల్స్‌ను కూడా ఏక కాలంలో తీస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2021లో 'అవతార్ 2', 2023లో 'అవతార్ 3' విడుదలవుతాయి. విడుదల తేదీలు సుదూరంగా ఉండటంతో అవి ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఆ తేదీలు మారాయి. 'అవతార్' తరహాలోనే ఈ సీక్వెల్స్ కూడా బ్లాక్‌బస్టర్స్ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
![]()
![]() |
![]() |