![]() |
![]() |

టాలీవుడ్‌లో నిర్మాణమవుతోన్న సినిమాల్లో అత్యంత భారీ చిత్రం, అత్యంత క్రేజీ చిత్రం ఏదంటే అందరూ చెప్పే ఒకే మాట.. 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని.. దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు బాగున్నట్లయితే 2020 జనవరి 8న ఆ సినిమాని చూసే అవకాశం మనకు కలిగేది. కరోనా మహమ్మారి దెబ్బకు సినిమా షూటింగ్‌లన్నీ అబ్బా అని మూలనపడ్డాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ షూటింగ్‌లకు కొన్ని నియమ నిబంధనలతో అనుమతులు ఇచ్చేశాయి. ఇంతకాలం షూటింగ్స్ లేకపోవడంతో చిత్ర పరిశ్రమ స్తంభించి పోయిందనీ, దినసరి వేతనంతో బతికే కార్మికుల స్థితిగతులు అధ్వాన్నంగా మారిపోయాయనీ, కాబట్టి షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వాల్సిందనీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చిరంజీవి ఆధ్వర్యంలోని టాలీవుడ్ పెద్దల బృందం అభ్యర్థించడం మనం చూశాం.
అదివరకే షూటింగ్స్‌కు ఓకే చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఇటీవలే ఈ పెద్దలు కలిసి ధన్యవాదాలు తెలపడం గమనించాం. చిత్రంగా అనుమతులు వచ్చినా షూటింగ్‌లకు వెళ్లకుండా ఈ పెద్దలంతా తాత్సారం చేస్తుండటం గమనార్హం. కారణం.. కోవిడ్ 19 కేసులు గతంలో కంటే మరింత ఎక్కువ స్థాయిలో ఉధృతమవుతుండటం.
'ఆర్ఆర్ఆర్' షూట్‌ను పట్టాలెక్కించాలని ఇటీవల రాజమౌళి భావించాడు. అందుకోసం మొదట రెండు రోజుల పాటు ట్రయల్ షూట్ నిర్వహించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఆయన వాయిదా వేశాడు. కారణం.. ఆయన ఎక్కడైతే ట్రయల్ షూట్ చెయ్యాలని భావించాడో ఆ లొకేషన్లకు అధికార యంత్రాంగం నుంచి అనుమతులు లభించలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ డూప్‌లతో ఆ ట్రయల్ చేయడానికి రాజమౌళి సిద్ధమైనా, పర్మిషన్ మాత్రం లభించలేదు. దాంతో ట్రయల్ షూట్ కోసం వేరే షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
ఇక రెగ్యులర్ షూట్ కోసం చాలా రోజులు కేటాయించాల్సి ఉండటం వల్ల 'ఆర్ఆర్ఆర్' మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తోన్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో కల్పిత కథతో తయారవుతున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని ప్రధాన పాత్రధారులు.
![]() |
![]() |