![]() |
![]() |

నో డౌట్... ఓటీటీలో సెమి న్యూడ్ సీన్స్ విపరీతంగా వచ్చి పడుతున్నాయి. కిస్సింగ్ సీన్స్ కామన్. ఇక బెడ్ రూమ్ సీన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించడమే ధ్యేయంగా శృంగార సన్నివేశాలను ఓటీటీ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లలో చొప్పిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన 'క్లైమాక్స్'లో కొన్ని సీన్స్ అయితే పోర్న్ ఫిలిమ్‌ని తలపించాయి. ఓటీటీలో శృంగార సన్నివేశాల గురించి సంప్రదాయవాదులు కొన్ని రోజులుగా అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో శృంగారానికి కత్తెర వేయాలా? వద్దా? అనే చర్చ మొదలైంది. ఓటీటీకి కూడా సెన్సార్ అవసరమని కొందరి అభిప్రాయం.
ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఓ ఆంగ్ల పత్రికతో "మితిమీరిన శృంగారం యువతపై చెడు ప్రభావం చూపిస్తుంది. సినిమాల్లో అసభ్యకర సన్నివేశాలకు కత్తెర వేసినట్టు ఓటీటీలో కంటెంట్ కి కూడా కత్తెర వేయాలి" అన్నారు. శృంగార, హింసాత్మక సన్నివేశాలు, బూతు పదాలను సెన్సార్ తగ్గించలేదనీ, డిజిటల్ మీడియా విషయంలో తల్లితండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని దర్శకురాలు నందినీరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఓటీటీ సెన్సార్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
![]() |
![]() |