![]() |
![]() |

దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకరు. సామాజిక సందేశం, అధునాతన సాంకేతికత మేళవింపుగా శంకర్ రూపొందించే భారీ బడ్జెట్ చిత్రాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. మొదటి సినిమా ‘జెంటిల్‌మేన్’ నుండి గత చిత్రం ‘2.0’ వరకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయా చిత్రాలను తనదైన శైలితో తెరకెక్కించాడు శంకర్. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ 1996 నాటి తన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇండియన్’కి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు. అందులో ప్రధాన పాత్ర పోషించిన లోకనాయకుడు కమల్ హాసన్ ఇందులోనూ కొనసాగుతున్నాడు.
కాగా ‘ఇండియన్ 2’ తర్వాత శంకర్ తీయబోయే సినిమాపై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్‌తో శంకర్ నెక్స్ట్ వెంచర్ ఉండొచ్చని, ‘ముదల్‌వన్’ (తెలుగులో ‘ఒకే ఒక్కడు’ పేరుతో అనువాదమైంది) సీక్వెల్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. తొలిభాగంలో యాక్షన్ హీరో అర్జున్ నటించగా.. సీక్వెల్‌లో ఆ పాత్రని విజయ్ కొనసాగిస్తున్నాడని వినికిడి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కెరీర్ ఆరంభంలో వేర్వేరు కథానాయకులతో సినిమాలు చేస్తూ వచ్చిన శంకర్.. ఇటీవల కాలంలో తన వరుస చిత్రాల కోసం తన హీరోలను రిపీట్ చేసే పనిలో పడ్డాడు. ‘ఐ’ కోసం తన ‘అనియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) కథానాయకుడు విక్రమ్‌ని రిపీట్ చేసిన శంకర్.. ఆ తరువాత ‘2.0’ కోసం తన ‘శివాజీ’, ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’) చిత్రాల కథానాయకుడు రజనీకాంత్‌ని పునరావృతం చేశాడు. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఇండియన్ 2’ కోసం ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) హీరో కమల్ హాసన్‌తో పాటు ‘బాయ్స్’ హీరో సిద్ధార్థ్‌ని కూడా రిపీట్ చేస్తున్నాడు. ‘ఐ’, ‘2.0’, ‘ఇండియన్’.. ఇలా శంకర్ మూడు వరుస చిత్రాలు కథానాయకుల పరంగా రిపీట్ మోడ్‌లో సాగాయన్న మాట. ఇప్పుడు ఇదే పరంపరలో తన తదుపరి చిత్రం కోసం ‘నన్బన్' (తెలుగులో ‘స్నేహితుడు’) కథానాయకుడు విజయ్‌ని పునరావృతం చేసే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం.
మొత్తమ్మీద.. వరుసగా సీక్వెల్స్, రిపీట్ హీరోస్ అంటూ ముందుకు సాగుతున్నాడు శంకర్.
![]() |
![]() |