![]() |
![]() |

తెలుగునాట శత చిత్రాలను తెరకెక్కించిన అతి కొద్దిమంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఆయన రూపొందించిన సినిమాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. వాటిలో ‘దొంగాట’కి ప్రత్యేక స్థానముంది. జగపతి బాబు, సౌందర్య, సురేశ్, రీతూ శివపురి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో శరత్‌బాబు, సుధాకర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, మల్లికార్జున రావు, బాలయ్య, ‘శుభలేఖ’ సుధాకర్, ప్రియ, డబ్బింగ్ జానకి ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఆంగ్ల చిత్రం ‘ఫ్రెంచ్ కిస్’ (1995) స్పూర్తితో తయారైన ‘దొంగాట’ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మించారు.
కథాంశం విషయానికి వస్తే.. తను ఆరాధించే బావ ప్రకాశ్ (సురేశ్) కోసం.. ఇల్లు వదిలి పెట్టి పట్నం వస్తుంది సుబ్బలక్ష్మి (సౌందర్య). అక్కడ అతని నిజస్వరూపం తెలుసుకున్నాక.. తనకి రైలులో పరిచయమైన రాజు (జగపతి బాబు) సహాయంతో ఎలాంటి గుణపాఠం చెప్పింది? అన్నదే ‘దొంగాట’ సినిమా.
రమణి భరద్వాజ్ స్వరాలు సమకూర్చిన `దొంగాట`కి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర, సాహితి పదరచన చేశారు. “చిలిపి చిరుగాలి”, “స్వప్నాల వెంట”, “ఓ.. చిలకా”, “ఓ ప్రియా ఏదో తమాషా”, “లల్లాగుడ మల్లేషా” అంటూ మొదలయ్యే ఇందులోని పాటలు అప్పట్లో ప్రజాదరణ పొందాయి. హిందీలో అజయ్ దేవగణ్, కాజోల్ జంటగా ‘ప్యార్ తో హోనా హి థా’(1998) పేరుతో ఈ చిత్రం రీమేక్ అయింది. కాగా, 1997 జూలై 11న విడుదలై ఘనవిజయం సాధించిన ‘దొంగాట’... నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంది.
![]() |
![]() |