![]() |
![]() |

ఇటీవల ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించడంతో.. తమ సినిమా సాధారణ టికెట్ ధరలతో విడుదలవుతుంది, ఓటీటీలోకి ఆలస్యంగా వస్తుంది వంటి ప్రకటనలతో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా వాళ్ళు. అయినప్పటికీ పలు సినిమాలు బయ్యర్లకు నష్టాలను మిగుల్చుతున్నాయి. ఇలాంటి సమయంలో టికెట్ ధరలు తగ్గించకుండా బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ మరింత రిస్క్ చేస్తోంది 'ది వారియర్' మూవీ టీమ్.
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జులై 14 న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే అధిక టికెట్ ధరలు, మూడు నాలుగు వారాలకే ఓటీటీలో విడుదల వంటి కారణాలతో ఫ్యామిలీలు థియేటర్స్ కి రావడం తగ్గించారు. ముఖ్యంగా తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఆసక్తి చూపించట్లేదు. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200-250 ధరలతో పలు సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ 'ది వారియర్' మాత్రం తగ్గేదేలే అంటుంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.175, మల్టీప్లెక్స్ లలో రూ.295 ధరలతో విడుదలవుతుంది. కొన్ని మల్టీప్లెక్స్ లలో ధర రూ.350 వరకు ఉండనుంది. అసలే ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్న సమయంలో అధిక టికెట్ ధరలతో వస్తున్న వారియర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |