![]() |
![]() |

'జాతిరత్నాలు' సినిమాతో కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కేవీ అనుదీప్ తన తదుపరి సినిమా 'ప్రిన్స్'ను కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రచయితగానూ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ. అనుదీప్ స్టొరీ అందించిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.
'ఫస్ట్ డే ఫస్ట్ షో' టీజర్ అనుదీప్ మార్క్ కామెడీతో టైటిల్ కి తగ్గట్లే ఉంది. టీజర్ బట్టి చూస్తే ఇది పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమా చుట్టూ తిరిగే కథ అనిపిస్తోంది. ఒకమ్మాయి 'నాకు ఖుషి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కావాలి' అని అడగటంతో.. ఆ టికెట్ తీసుకురావడం కోసం అబ్బాయి పడే అవస్థలను సరదాగా, ఆసక్తికరంగా చూపించారు. ఆన్ లైన్ బుకింగ్, క్యూబ్ వంటివి లేని టైములో.. టికెట్స్ కోసం ఎంతలా కష్టపడేవారు, థియేటర్ దగ్గరకు మూవీ ప్రింట్ బాక్స్ వస్తే ఎంత సందడి ఉండేది వంటివి టీజర్ లో చూపించారు. ఇక చివరిలో 9 నెలల నిండు గర్భిణి టికెట్స్ కోసం థియేటర్ దగ్గర నిల్చొని, పక్కన వాళ్ళని తిడుతూ అనుదీప్ మార్క్ కామెడీతో టీజర్ ముగిసింది.

'జాతిరత్నాలు' సినిమాకి డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పనిచేసిన వంశీ, లక్ష్మీనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూర్ణోదయ పిక్చర్స్, శ్రీజ ఎంటర్టైన్మెంట్స్, మిత్రవింద మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రధన్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |