![]() |
![]() |

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జిన్నా'. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'గాలి నాగేశ్వరరావు' అనే పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
'జిన్నా' ఫస్ట్ లుక్ ను ఓ వీడియో ద్వారా కాస్త కొత్తగా రివీల్ చేశారు. మొదట సినిమాటోగ్రఫర్ ఛోటా కె. నాయుడు తాను రెడీ అని, హీరోని పిలవాలని చెప్పడంతో.. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి "విష్ణు సార్ షాట్ రెడీ" పిలుస్తాడు. కానీ విష్ణు రాడు. తర్వాత స్టంట్ కొరియోగ్రాఫర్ రామ్ కృష్ణన్ కూడా తాను రెడీ అని చెప్పడంతో.. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి పిలిచినా విష్ణు రాడు. ఇంతలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వచ్చి ఏం జరిగిందని అడిగితే.. హీరో రావట్లేదని చెప్పడంతో.. అసిస్టెంట్ తో "జిన్నా షాట్ రెడీ" అని పిలవమని చెప్తాడు. అలా పిలవగానే విష్ణు స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అంటే జిన్నా పాత్రలో విష్ణు అంతలా లీనమైపోయాడు అని అర్థమొచ్చేలా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. వైట్ అండ్ వైట్ డ్రెస్, మెడలో కర్చీఫ్, సన్ గ్లాసెస్ తో విష్ణు లుక్ ఆకట్టుకుంటోంది.

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్ స్టొరీ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |