![]() |
![]() |

తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ ద్వారా పరిచయమై, అక్కడ పాపులర్ అయ్యాక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత ధూళిపాళ. హిట్ మూవీ 'గూఢచారి'లో అడివి శేష్ జోడీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆకట్టుకుంది. అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉండే శోభిత.. ఇటీవల అడివి శేష్ బ్లాక్‌బస్టర్ మూవీ 'మేజర్'లో ప్రమోదా రెడ్డి క్యారెక్టర్‌లో ఎలా రాణించిందో చూశాం. క్యారెక్టర్‌ను అవగాహన చేసుకొని, అందులో పరకాయ ప్రవేశం చేసే ప్రతిభ ఆమె సొంతం.
అందుకే.. ఆమెకు ఏకంగా మణిరత్నం మాగ్నమ్ ఓపస్ 'పొన్నియన్ సెల్వన్'లో ఓ కీలక పాత్ర లభించింది. అదీ.. టైటిల్ పాత్రధారి జయం రవి జోడీగా! ఈ మూవీలో ఆమె కోడంబళూర్ యువరాణి వానతి పాత్రను పోషించింది. ఇటీవల రిలీజైన టీజర్‌లో జయం రవితో పాటు ఓ క్షణం తళుక్కున మెరిసింది శోభిత. రెండు భాగాలుగా తయారవుతున్న 'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగం సెప్టెంబర్ 30న రిలీజవుతోంది. ఈ సినిమా విడుదలయ్యాక శోభిత పాపులారిటీ దేశవ్యాప్తంగా విస్తరించడం ఖాయం.
తెనాలిలో జన్మించిన శోభిత, విశాఖపట్నంలో పెరిగింది. ముంబై యూనివర్సిటీకి చెందిన H.R. College of Commerce and Economics లో చదువుకున్న ఆమె, ముంబైలోనే కెరీర్‌ను వెతుక్కుంది. అలా అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'రమన్ రాఘవ్ 2.0' మూవీలో హీరోయిన్‌గా పరిచయమైంది. 2019లో వచ్చిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' ఆమె పాపులారిటీని పెంచింది. త్వరలో ఆమె హాలీవుడ్ సినిమాలోనూ కనిపించనుంది. దేవ్ పటేల్ లీడ్ రోల్ చేస్తూ డైరెక్ట్ చేస్తోన్న 'మంకీ మ్యాన్'లో ఫిమేల్ లీడ్ రోల్‌ను చేస్తోంది శోభిత.
![]() |
![]() |