![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ నటించిన పలు రీమేక్స్ విజయపథంలో పయనించాయి. వాటిలో `దృశ్యం` ఒకటి. మలయాళ చిత్రం `దృశ్యం` (2013) ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి శ్రీప్రియ దర్శకత్వం వహించగా.. వెంకీకి జోడీగా మీనా దర్శనమిచ్చింది. ఫ్యామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నరేశ్, నదియా, బేబి ఎస్తేర్ అనిల్, కృతిక, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వర రావు, చలపతి రావు, అన్నపూర్ణ, సప్తగిరి, చిత్రం శ్రీను, ఉత్తేజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కథాంశం విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాంబాబు (వెంకటేశ్) అనే ఓ కేబుల్ టీవీ ఆపరేటర్.. ఓ అనూహ్య సమస్యలో చిక్కుకున్న తన ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు? అన్నదే `దృశ్యం` చిత్రం.
శరత్ సంగీతమందించిన `దృశ్యం`కి చంద్రబోస్ సాహిత్యమందించారు. ``ప్రతి రోజూ పండగ రోజు``, ``నిమిషం నిమిషం`` అంటూ సందర్భానుసారం సాగే ఇందులోని రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ (ప్రై) లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ పతాకాలపై సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి నిర్మించిన `దృశ్యం`.. 2014 జూలై 11న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 8 వసంతాలు పూర్తిచేసుకుంది. కాగా, ఇటీవల వచ్చిన ఈ సినిమా సీక్వెల్ `దృశ్యం 2` కూడా ఓటీటీలో రిలీజై ప్రశంసలు పొందింది.
![]() |
![]() |