![]() |
![]() |

'పరివార్' చేసిన ఫిర్యాదు ఆధారంగా పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ చేసిన 'కడువా' డైరెక్టర్ షాజీ కైలాస్, నిర్మాతలు సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్‌పై ఇటీవల 'ద స్టేట్ కమిషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్' నోటీసులు జారీ చేసింది. కడువా మూవీలోని ఓ సన్నివేశంలో దివ్యాంగ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, తల్లితండ్రులు చేసిన పాపాల ఫలితంగానే వారలా పుడతారని చెప్పడం తీవ్ర విమర్శలకు, దివ్యాంగులు ఆగ్రహానికీ దారితీసింది. ఇప్పుడు హీరో, డైరెక్టర్ ఇద్దరూ తమ తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.
డైరెక్టర్ షాజీ కైలాస్ తన ఫేస్‌బుక్ పేజీలో ఓ సుదీర్ఘమైన నోట్‌లో క్షమాపణలు తెలియజేయడమే కాకుండా, తమ తప్పును అంగీకరించాడు. "నేను డైరెక్ట్ చేసిన 'టైగ'ర్ మూవీని ఇందులో రిఫర్ చేసిన విధానం దివ్యాంగ పిల్లల తల్లితండ్రుల హృదయాలను గాయపరిచినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. దీన్నొక మానవ తప్పిదంగా భావించి, క్షమించమని అర్థిస్తున్నాను. విలన్ చేసే పనులు ఎంత క్రూరంగా ఉంటాయో ఆడియెన్స్‌కు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆ డైలాగ్ రాశాం. అందులోని తప్పును నేను కానీ, స్క్రీన్‌రైటర్ జిను కానీ, హీరో పృథ్వీరాజ్ కానీ గుర్తించలేకపోయాం. తల్లితండ్రుల చర్యల వల్ల ఏర్పడే పరిణామాలను వైకల్యాల రూపంలో పిల్లలు అనుభవిస్తారని చెప్పడం మా ఉద్దేశం కాదు." అని ఆయన రాసుకొచ్చారు.
షాజీ కైలాస్ నోట్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, "సారీ. ఇదొక మిస్టేక్. దాన్ని మేం గుర్తించి, అంగీకరిస్తున్నాం" అని రాశాడు. వివేక్ ఓబరాయ్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈనెల 7న విడుదలై, ఈ డైలాగ్ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యింది.
![]() |
![]() |