![]() |
![]() |

``నువ్వు నందవైతే నేను బద్రి.. బద్రినాథ్``.. అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన చిత్రం `బద్రి`. ఈ సినిమా కోసమే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. ఇందులో పవన్ ని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. వినూత్న తరహా హీరోయిజానికి తెలుగునాట శ్రీకారం చుట్టారు పూరి. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కి జంటగా రేణు దేశాయ్, అమీషా పటేల్ నటించగా ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, సంగీత, బ్రహ్మానందం, మల్లికార్జున రావు, ఎమ్మెస్ నారాయణ, అలీ, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రమణ గోగుల సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. మరీముఖ్యంగా ``బంగాళాఖాతంలో`` చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలవగా.. ``యే చికితా``, `వేవేల మైనాల గానం``, ``చలిపిడుగుల్లో`, `ఐయామ్ యాన్ ఇండియన్`` గీతాలు కూడా రంజింపజేశాయి. 2004లో ఈ చిత్రాన్ని `షర్త్ - ది ఛాలెంజ్` (తుషార్ కపూర్, గ్రేసీ సింగ్, అమృతా అరోరా, ప్రకాశ్ రాజ్) పేరుతో రీమేక్ చేసి హిందీనాట కూడా కెప్టెన్ గా తనదైన ముద్ర వేశారు పూరి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించిన `బద్రి`.. 2000 ఏప్రిల్ 20న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్.. 22 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |