![]() |
![]() |

కథానాయకుడిగా కింగ్ నాగార్జున స్థాయిని పెంచిన చిత్రాల్లో `హలో బ్రదర్` ఒకటి. ఇందులో దేవాగా, రవివర్మగా కవల సోదరుల పాత్రల్లో భలేగా ఎంటర్టైన్ చేశారు నాగ్. అగ్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ వినోదాత్మక చిత్రంలో నాగ్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య నటించగా.. ఆమని, రంభ, ఇంద్రజ ఓ ప్రత్యేక గీతంలో తమ చిందులతో కనువిందు చేశారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, శరత్ బాబు, శ్రీహరి, నెపోలియన్, రాజనాల, గిరిబాబు, బాబూ మోహన్, అలీ, అన్నపూర్ణ, సంగీత, సుధ, చరణ్ రాజ్, శివాజీ రాజా, శ్రీలక్ష్మీ, శివపార్వతి, మాస్టర్ ఆదిత్య తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఎల్బీ శ్రీరామ్ అందించిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రాజ్ - కోటి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా ``ప్రియరాగాలే`` అంటూ సాగే గీతం ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలవగా.. ``మనసిచ్చి``, ``కన్నెపెట్టరో``, ``ఎక్కండయ్యా బాబు``, ``చుక్కేసి పక్కేసి``, ``అరె.. ఏందెబ్బా`` పాటలు కూడా రంజింపజేశాయి. `ఉత్తమ సంగీత దర్శకుడు` (రాజ్ - కోటి), `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` (ఎస్. గోపాల్ రెడ్డి), `ఉత్తమ ఎడిటర్` (రవీంద్ర బాబు) విభాగాల్లో `నంది` పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని.. హిందీలో `జుడ్వా` (సల్మాన్ ఖాన్) పేరుతోనూ, కన్నడంలో `చెలువా` (రవిచంద్రన్) టైటిల్ తోనూ, బెంగాలీలో `భాయ్ జాన్ ఏలో రే` (షకీబ్ ఖాన్) శీర్షికతోనూ రీమేక్ చేశారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మించిన `హలో బ్రదర్`.. 1994 ఏప్రిల్ 20న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 28 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |