![]() |
![]() |

సందేశాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. `శ్రీమంతుడు` (2015) వంటి ఘనవిజయం తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన `భరత్ అనే నేను` (2018) కూడా అచ్చంగా ఆ తరహా చిత్రమే. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. ప్రామిస్ నిలబెట్టుకునేందుకు అంతఃకరణ శుద్ధితో పనిచేసే భరత్ రామ్ అనే యువ ముఖ్యమంత్రిగా మెస్మరైజ్ చేశారు మహేశ్. అతనికి జోడీగా కియారా అద్వాని నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, ఆమని, సితార, దేవరాజ్, పోసాని కృష్ణమురళి, పి. రవిశంకర్, రావు రమేశ్, బ్రహ్మాజీ, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు ``వచ్చాడయ్యో సామి``, ``వసుమతి``, ``ఐ డోన్ట్ నో``, ``ఇది కలలా ఉన్నదే`` అంటూ సాగే పాటలు కూడా విశేషాదరణ పొందాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన `భరత్ అనే నేను`.. 2018 ఏప్రిల్ 20న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 4 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |