![]() |
![]() |

మ్యూజికల్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాణ సంస్థల్లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ నుంచి వచ్చిన మ్యూజికల్ హిట్స్ లో `పౌర్ణమి`కి ప్రత్యేక స్థానం ఉంది. `వర్షం` (2004) వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, చెన్నై పొన్ను త్రిష కాంబినేషన్ లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని మల్టిటాలెంటెడ్ ప్రభుదేవా తెరకెక్కించారు. ఛార్మి మరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాహుల్ దేవ్, సింధు తులాని, చంద్రమోహన్, మంజు భార్గవి, ముకేశ్ రిషి, గీత, మధు శర్మ, కోట శ్రీనివాస రావు, సునీల్, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అజయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, మల్లికార్జున రావు, వేద ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. తన ప్రియురాలు పౌర్ణమి (త్రిష) చివరి కోరికని ఆమె చెల్లెలు చంద్రకళ (ఛార్మి) ద్వారా కేశవ (ప్రభాస్) ఎలా నెరవేర్చాడు? అనేదే `పౌర్ణమి` చిత్రం.
దిగ్గజ గీతరచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన పాటలకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ``మువ్వలా నవ్వకలా``, ``ఇచ్చిపుచ్చుకుంటే``, ``భరతవేదముగా``, ``పల్లకివై``, ``ఎవరో చూడాలి``, ``ఎవరో రావాలి``, ``భవ్యమైన``, ``కోయో కోయో``, ``రాక్ అండ్ రోల్``.. ఇలా ఇందులోని పాటలన్నీ సంగీత ప్రియులను రంజింపజేశాయి. `ఉత్తమ కళా దర్శకుడు` (అశోక్) విభాగంంలో `నంది` పురస్కారం అందుకున్న `పౌర్ణమి`.. 2006 ఏప్రిల్ 20న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |