![]() |
![]() |

(ఈ ఏప్రిల్ 20.. కథానాయిక అంజలా ఝవేరి 50వ పుట్టినరోజు సందర్భంగా..)
తెలుగు తెరపై ఎంతోమంది కథానాయికలు సందడి చేశారు. అయితే, హ్యాట్రిక్ విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ మాత్రం కొందరే. వారిలో ఒకప్పటి అగ్ర కథానాయిక అంజలా ఝవేరికి ప్రత్యేక స్థానం ఉంది. 1997లో విడుదలై ఘనవిజయం సాధించిన `ప్రేమించుకుందాం..రా!`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అంజలా.. మొదటి తెలుగు సినిమాతోనే అప్పటి కుర్రకారుకి కునుకు లేకుండా చేసింది. ఆపై `చూడాలని వుంది!` (1998)తో మరో సంచలన విజయం అందుకున్న ఈ స్టార్ బ్యూటీ.. ఆనక `సమరసింహారెడ్డి` (1999)తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా.. తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ గా అప్పట్లో రికార్డులకెక్కింది.
అంతేకాదు.. తొలి మూడు తెలుగు చిత్రాల్లో విక్టరీ వెంకటేశ్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇలా అప్పటి అగ్ర కథానాయకులతోనే జతకట్టి అంజలా ఝవేరి ఈ ఘనవిజయాలు అందుకోవడం ఓ అరుదైన అంశమనే చెప్పాలి. అలాగే, తన నాలుగో తెలుగు చిత్రం `రావోయి చందమామ` (1999) కోసం మరో టాప్ స్టార్ కింగ్ నాగార్జునకి జోడీగా కనిపించిన అంజలా.. ఆపై `దేవీపుత్రుడు` (2001)లో వెంకీతో మరోసారి, `భలేవాడివి బాసూ!` (2001)లో బాలయ్యతో ఇంకోసారి జట్టుకట్టి వార్తల్లో నిలిచింది. ఏదేమైనా.. వరుసగా ఆరు తెలుగు చిత్రాల్లో ఒక తరానికి చెందిన అగ్ర కథానాయకుల (చిరు, బాలయ్య, నాగ్, వెంకీ)తోనే ఆడిపాడడం ఒక్క అంజలా ఝవేరికే చెల్లిందనే చెప్పాలి. కొసమెరుపు ఏంటంటే.. అంజలా ఝవేరి నటించిన ఈ తొలి ఆరు తెలుగు చిత్రాలకు కూడా మెలోడీ బ్రహ్మ మణిశర్మనే సంగీత దర్శకుడు కావడం మరో విశేషం.
![]() |
![]() |