![]() |
![]() |

సినిమాకు ప్రాణం పబ్లిసిటీనే. ఆ మాటకొస్తే ఏ ప్రొడక్ట్‌కైనా ప్రచారం అనేది అత్యంత కీలకం. లోపలి సరుకు అటు ఇటుగా ఉన్నా పబ్లిసిటీ కారణంగానే సినిమాలు జనాదరణ పొందిన దాఖలాలు ఎన్నో. అంతటి పవర్‌ఫుల్ అయిన సినిమా పబ్లిసిటీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకవైపు ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలో పబ్లిసిటీకి భారీగా ఖర్చు చేస్తూనే, మరోవైపు అభిమానులకు, సినీ ప్రియులకు మరింత చేరువ కావడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు.
చిన్న సినిమాలకు కొన్నిసార్లు బడ్జెట్‌ను మించి పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు అడివి శేష్, అదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రధారులుగా, రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పీవీపీ సంస్థ నిర్మించిన 'క్షణం' ప్రొడక్షన్ కాస్ట్ రూ. 1.10 కోట్లయితే, పబ్లిసిటీ కాస్ట్ రూ. 1.50 కోట్లు! టీవీ, వెబ్ మీడియాలో ఈ సినిమా ప్రచారానికి బాగా ఖర్చు పెట్టారు. అయితేనేం.. ఖర్చు పెట్టిన రూపాయికి రెండు రూపాయల లాభం వచ్చింది.
అయితే అన్ని సినిమాలకూ ఇది వర్తించదు. పబ్లిసిటీకి ఉపయోగించే "విషయం" ఇందులో కీలకమనేది గుర్తించాలి. ఆసక్తికరంగా ట్రైలర్‌నూ, ప్రకటనలనూ రూపొందిస్తే, సినిమాకు మేలు చేకూరుతుందని హృదయ కాలేయం, క్షణం, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, హిట్ లాంటి సినిమాలు నిరూపించాయి.
![]() |
![]() |