![]() |
![]() |

దీపావళి పర్వదినం రోజు మెగాస్టార్ చిరంజీవి తనకు గురుతుల్యులైన కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను సతీసమేతంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి కూడా. అయితే ఆ ఫొటోల్లో విశ్వనాథ్, చిరు సన్నిహితంగా ఉండటం కాంట్రవర్సీ సృష్టించింది. అసలే కరోనా మహమ్మారి రోజులు.. సోషల్ డిస్టాన్స్ పాటించమని విజ్ఞులైన వాళ్లందరూ చెప్తున్న విషయం. ప్రభుత్వాలు, డాక్టర్లు ఈ విషయమై నెత్తీనోరూ బాదుకొని మరీ చెప్తున్నారు. చిరంజీవి సైతం ఈ అంశంలో తనవంతు ప్రచారాన్ని చేస్తున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తి ఆయనే స్వయంగా సామాజిక దూరం పాటించకుండా, కురువృద్ధుడైన కె. విశ్వనాథ్ ఇంటికెళ్లి, ఆయనను ఆలింగనం చేసుకోవడం, వాటిని గొప్పగా మీడియాకు రిలీజ్ చేయడం ఏమిటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ ఫొటోల్లో విశ్వనాథ్ గుండెలపై చిరు తలవాల్చితే, ఆయన తలను విశ్వనాథ్ చేతులతో పట్టుకోవడం కనిపిస్తోంది. ఇలా చేయడం చిరంజీవికి తగిన పనేనా? అని ఇండస్ట్రీ వర్గాలు సైతం విస్తుపోతున్నాయి.
పైగా ఇటీవల చిరంజీవికి కొవిడ్ 19 పాజిటివ్ అని టెస్ట్‌లో రావడం, రెండు రోజులకే మళ్లీ నెగటివ్ అని తేలడం కూడా వివాదాస్పదమైంది. కొవిడ్ టెస్ట్‌ల రిజల్ట్‌ని ఈ ఉదంతం ప్రశ్నార్థకంగా మార్చింది. మొదట పాజిటివ్ వచ్చి, తర్వాత రెండు రోజుల్లో నెగటివ్ రావడం అనేది అసంభవమేమీ కాదని డాక్టర్లు అంటున్నారు. మొదటి టెస్ట్ పాజిటివ్ అని చెప్పిన కిట్‌లో లోపముందని నిర్ధారించడం ఎంతవరకు శాస్త్రీయమైందో తెలీదు. ఏదేమైనా తనకు పాజిటివ్ నుంచి నెగటివ్ అని వచ్చినప్పటికీ, ముందు జాగ్రత్తగా చిరంజీవి 14 రోజులు క్వారంటైన్‌లో ఉండటమే శ్రేయస్కరమని చాలామంది భావిస్తున్నారు. ఇలా చేస్తే.. ఆయనకూ, ఎదుటివాళ్లకూ మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు.
కానీ చిరంజీవి తనకు పాజిటివ్ అని వచ్చిన తర్వాత రెండు రోజులకే మళ్లీ టెస్ట్ చేయించుకోవడం, రిజల్ట్ నెగటివ్ రావడం, ఆ తర్వాత మరో రెండు ల్యాబుల్లో టెస్ట్ చేయించుకొని నెగటివ్ అని ధ్రువీకరించుకోవడం మనకు తెలిసిందే. దీంతో ఆయన అసలు తనకు కొవిడ్ అనేది అసలు రానేలేదని నిర్ధారించుకొని, రెండు రోజులు గడవక ముందే కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు విచారించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. విశ్వనాథ్‌కు ఇప్పుడు 90 సంవత్సరాలు. అంతటి వృద్ధుడి యోగక్షేమాలు ముఖ్యమనుకుంటే కరోనా టైమ్‌లో ఆయన వద్దకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమనే ఆలోచన ఆయనకు కలగకపోవడం ఆశ్చర్యకరమైతే, సామాజిక దూరం పాటించకుండా ఆయనను ఆలింగనం చేసుకొని ఫొటోల కోసం పోజులివ్వడం మరింత ఆశ్చర్యకరమే కాదు, ఆక్షేపణీయం కూడా. ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించాలనుకుంటున్న వ్యక్తి చేయాల్సిన పనులు ఇలాంటివి కావనే విమర్శలు ఇండస్ట్రీ నుంచే వినిపిస్తున్నాయి.
![]() |
![]() |