![]() |
![]() |

ప్రభాస్ రామాయణంలో సీతగా నటించేది ఎవరు? 'ఆది పురుష్'లో కథానాయిక ఎవరు? ఇప్పటికీ పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత ప్రభాస్ సరసన సీతగా అనుష్క శెట్టి నటిస్తుందని అన్నారు. అయితే తన దగ్గరకు అటువంటి ప్రతిపాదన ఏమీ రాలేదని ఆమె స్పష్టం చేశారు. 'నిశ్శబ్దం' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 'ఆది పురుష్' చేయడం లేదని, ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఎవరూ తనను సంప్రదించలేదని అనుష్క చెప్పారు. ఆ తరువాత బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. సీతగా అనుష్క శర్మ చేయడం లేదని ఆమె టీమ్ మీడియాకి చెప్పింది.
ఒకానొక సమయంలో తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో నటించిన కియారా అద్వానీ పేరు కూడా సీత పాత్రకు పరిశీలనలో ఉందని వినిపించింది. ఇప్పుడు తాజాగా అనన్య పాండే పేరు వినబడుతోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమె నటిస్తోంది. సీత పాత్రకు ఆమెను తీసుకుంటున్నారని ఇది తాజా సమాచారం. అయితే 'ఆది పురుష్' దర్శకనిర్మాతలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. నిజంగానే అనన్యా పాండేను ఎంపిక చేశారో? లేదా ఇంకెన్ని పేర్లు ప్రచారంలోకి వస్తాయో చూడాలి.
రామాయణం ప్రేరణతో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న 'ఆది పురుష్' చిత్రంలో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. లంకాధిపతి రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు.
![]() |
![]() |