నిన్ను తిట్టను, కొట్టను.. ఒక్కసారి వచ్చి కలువు!
on Jun 29, 2025
విక్రమార్కుడులో బాలనటుడిగా కనిపించి అలరించిన రవి రాథోడ్.. పదుల సంఖ్యలో సినిమాల్లో నటించాడు. కానీ, నటుడిగా మాత్రం స్థిరపడలేకపోయాడు. అతని జీవితంలో కొన్ని విషాదాలు చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయాడు. నటుడిగా అవకాశాలు రాక.. సెట్ వర్క్స్ చేస్తున్నాడు. ఈ విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రవి రాథోడ్. అదే ఇంటర్వ్యూలో తనకు రాఘవ లారెన్స్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నాడు. లారెన్స్ ఎంతో మంచి వ్యక్తి అని.. అప్పట్లో ఆయన తనను స్కూల్ లో చేర్పిస్తే, హాస్టల్ లో ఉండకుండా పారిపోయి వచ్చేశానని రవి చెప్పాడు. ఇప్పుడు లారెన్స్ ని కలిస్తే.. ఆయన నన్ను తిడతారు లేదా కొడతారేమో అని రవి అన్నాడు.
రవి రాథోడ్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ లారెన్స్ ని చేరాయి. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఈ వీడియో చూసి నా గుండె తరుక్కుపోయింది. మాస్ మూవీ షూటింగ్ సమయంలో నేను తనని కలిశాను. ఓ స్కూల్ లో చేర్పించాను. కానీ సంవత్సరం తర్వాత, తను వెళ్లిపోయాడని తెలిసింది. నేను తన కోసం వెతకడానికి ప్రయత్నించాను కానీ ఎటువంటి సమాచారం దొరకలేదు. చాలా సంవత్సరాల తర్వాత తనని చూడటం నన్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది. అలా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నేను ఏమైనా అంటానని భయపడుతున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను నిన్ను ఏమీ అనను. కొట్టను, తిట్టను. నాకు నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. దయచేసి వచ్చి కలవు." అని లారెన్స్ రాసుకొచ్చారు.
కొరియోగ్రాఫర్ గా, యాక్టర్ గా, డైరెక్టర్ గా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేయడమే కాకుండా.. సేవ చేయడంలోనూ లారెన్స్ ముందుంటారు. ఎందరికో అండగా నిలిచారు. ఇప్పుడు రవి రాథోడ్ కి లారెన్స్ మళ్ళీ ఓ మంచి దారి చూపిస్తారేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
