కుబేర మూవీ రివ్యూ
on Jun 20, 2025
తారాగణం: అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సర్భ్, దలీప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
డీఓపీ: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి
సహ రచయిత: చైతన్య పింగళి
రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్
విడుదల తేదీ: జూన్ 20, 2025
నాగార్జున, ధనుష్, రష్మిక, శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ 'కుబేర' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో హిట్ టాక్ ని తెచ్చుకున్న మూవీగా కూడా కుబేర నిలిచింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
దీపక్(నాగార్జున) సిన్సియర్ సిబిఐ అధికారి. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా ఉద్యోగం కోల్పోయి అక్రమ కేసులు మోపడంతో జైలు శిక్ష అనుభవిస్తు ఉంటాడు. దేవా(ధనుష్) తిరుపతి ప్రాంతంలో ఉండే ఒక బిచ్చగాడు. బాల్యం నుంచే బిచ్చగాడుగా బతుకుతుండటం వలన చదువుతో పాటు లోకజ్ఞానం తెలియదు. తన లాంటి వృత్తి చేసుకునే వారితో పాటు, ఎదుటివారి పట్ల జాలి, దయ కలిగి ఉంటాడు. ముంబైలో నివసించే నీరజ్ (జిమ్ సర్బ్) ఒక బిలినియర్. కొన్నిలక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతితో పాటు, తన వ్యాపార విస్తరణ కోసం ఎంతమందినైనా చంపగలిగే సమర్థుడు. దీపక్ ని జైలు నుంచి విడిపించి తన వ్యాపార లక్ష్యం కోసం నియమించుకుంటాడు. ప్రేమించిన వాడు మోసం చెయ్యడంతో నల్గొండ ప్రాంతానికి చెందిన సమీరా(రష్మిక) ముంబై వస్తుంది. దేవాతో పాటు ఇతర ప్రాంతాలకి చెందిన ముగ్గురు బిచ్చగాళ్ళని దీపక్ ముంబై తీసుకొస్తాడు. ఒక రహస్యం తెలిసిన దేవా ప్రాణ భయంతో వాళ్ళ దగ్గరి నుంచి పారిపోతాడు. ఈ క్రమంలో దేవా,సమీరాకి పరిచయం జరుగుతుంది. తనకి ఇష్టం లేకపోయినా దేవాతో సమీరా ట్రావెల్ అవుతుంది. దేవాని చంపడానికి దీపక్ వెతుకుతుంటాడు. దీపక్ నిజంగానే చెడ్డవాడా? ఒక వేళ చెడ్డవాడైతే సిన్సియర్ సిబిఐ అధికారి ఆ విధంగా ఎందుకు మారాడు? అసలు దేవాని ముంబై కి ఎందుకు తీసుకొచ్చారు? ఏ రహస్యం తెలుసుకొని దేవా పారిపోయాడు? దేవాని దీపక్ నిజంగానే చంపాడా? లేక కాపాడాడా? దేవా, దీపక్ కి గతంలోనే పరిచయం ఉందా? చివరకి ఎవరు గెలిచారు, ఎవరు చనిపోయారు? అసలు కుబేర ఎవరు? అనేదే ఈ చిత్రం.
ఎనాలసిస్
కుబేర ప్రమోషన్స్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతు ఇలాంటి కథతో కూడా సినిమా తెరకెక్కించవచ్చా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. అన్ని వర్గాల వారికి సినిమా నచ్చుతుందని చెప్పాడు. ఈ మాట అక్షరాలా సత్యం. పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై ఒక సరికొత్త కథ ఆవిష్కృతమైంది. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ నుంచే ప్రేక్షకుడు కంప్లీట్ గా కుబేర కి సరండర్ అయ్యేలా కథనం, క్యారక్టర్ ల పరిచయం సాగింది. దీపక్ ని నీరజ్ జైలు నుంచి బయటకి తీసుకురావడం, దీపక్ తన లక్ష్యంలో భాగంగా దేవాతో పాటు మరికొంత మందిని ముంబై కి తీసుకురావడం, వాళ్ళ మధ్య వచ్చిన సీన్స్ అన్ని బాగున్నాయి. బిచ్చగాళ్ల కి ఏం తెలియదు కాబట్టి ముంబై లో ప్రజల మధ్యకి వాళ్ళని పంపించి కామెడీ ని సృష్టించాల్సింది. సమీరా క్యారక్టర్ ని కూడా ఫస్ట్ హాఫ్ మధ్యలోనే చూపించి, దేవాని కోటీశ్వరుడిగా భావిస్తు ఉండాల్సింది. ఈ దిశగా ఆలోచించకుండా ఒకే పాయింట్ పై ఫస్ట్ హాఫ్ ని నడిపించారు. కానీనటీ నటుల పెర్ ఫార్మెన్స్ వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో సమీరా, దేవా మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుండటంతో పాటు, కథ అనేక మలుపులు తిరిగి, ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. దీపక్ క్యారక్టర్ ఒక్కసారిగా తన అసలు రూపమైన సిన్సియర్ అధికారిగా మారడంతో కథనంలో మంచి స్పీడ్ వచ్చింది. కాకపోతే దీపక్ తన ఓల్డ్ స్టైల్లో మారడానికి మంచి సీన్ ని క్రియేట్ చేసి, ఆ తర్వాత తన భార్య పిల్లలని దుబాయ్ పంపించి ఉంటే బాగుండేది. పైగా సెకండ్ హాఫ్ కొంచం లాగ్ అనిపిస్తుంది. దేవా దైర్యంగా మారడం బాగుంది. టోటల్ గా ప్రీ క్లైమాక్ బాగున్నా క్లైమాక్ మాత్రం కొంచం వీక్ గా అనిపిస్తుంది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
దీపక్ క్యారక్టర్ లో నాగార్జున నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కోసమే ఆ క్యారక్టర్ పుట్టినట్టుగా జీవించాడు. దేవా అనే బిచ్చగాడు క్యారక్టర్ లో ధనుష్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నిజమైన బిచ్చగాడు మన కళ్ళ ముందు ఉన్నాడు అనేంతలా పెర్ఫార్మ్ చేసాడు. రిపీట్ ఆడియెన్స్ ని రప్పించేంతలా తన నటన కొనసాగింది. దేవా క్యారక్టర్ తన సినీ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నటన అద్భుతం. సమీరా గా కూడా రష్మిక మరో సారి తను ఎంత పెద్ద నటినో నిరూపించింది. సెకండ్ ఆఫ్ లో ఎంటర్ అయినా కూడా సినిమా మొత్తం తాను ఉందనేలా అనిపిస్తుంది. దీన్ని బట్టి సమీరాగా రష్మిక చేసిన మ్యాజిక్ ని అర్ధం చేసుకోవచ్చు. విలన్ గా బిలీనియర్ నీరజ్ పాత్రలో చేసిన జిమ్ సర్బ్ నటన కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని దాటింది. తన క్యారక్టర్ ద్వారా బిలినియర్ బాడీ లాంగ్వేజ్ ని కళ్ళ ముందు ఉంచాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక కొత్త శేఖర్ కమ్ముల ప్రతి ఫ్రేమ్ లోనే కనపడ్డాడు. కథనాన్ని వేగం పెంచిన తీరు, నటీనటుల నుంచి పెర్ఫార్మ్ రాబట్టడంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి కొత్త లుక్ ని ఇచ్చింది. కాకపోతే రష్మిక పై చిత్రీకరించిన సాంగ్ లేదు. ఫొటోగ్రఫీ కూడా ఎక్స్ లెంట్. ముంబై ని కళ్ళ ముందు ఉంచింది. డైలాగ్స్ ఇంకా మెప్పించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సూపర్ గా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే సరికొత్త కథ, కథనాలతో సాగిన కుబేర ప్రేక్షకులని మెప్పిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచం లాగ్ గా ఉంది.
రేటింగ్ 2.75/5 అరుణాచలం

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
