'కృష్ణమ్మ' మూవీ రివ్యూ
on May 10, 2024
సినిమా పేరు: కృష్ణమ్మ
తారాగణం: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అతిర, అర్చన అయ్యర్, నందగోపాల్, రఘు కుంచే తదితరులు
సంగీతం: కాలభైరవ
డీఓపీ: సన్నీ కూరపాటి
ఎడిటర్: తమ్మిరాజు
రచన, దర్శకత్వం: వి.వి. గోపాల కృష్ణ
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి
బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
విడుదల తేదీ: మే 10, 2023
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథలు, పాత్రలతో అలరిస్తుంటాడు సత్యదేవ్. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు 'కృష్ణమ్మ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచారం చిత్రాలు ఆకట్టుకోవడం, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడు కావడంతో.. 'కృష్ణమ్మ' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అనాథలైన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ బూరుగుల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ.. నేరాల జోలికి పోకుండా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్వంగ్లింగ్ వంటివి చేస్తూ.. పొట్ట నింపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మీనా రాకతో భద్రలో మార్పు వస్తుంది. ఆమెని సొంత చెల్లిలా చూసుకుంటూ.. స్మగ్లింగ్ మానేసి, ఆటో నడుపుతూ సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తాడు. ఇలా జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయనుకుంటున్న సమయంలో.. మీనా తల్లి ఆపరేషన్ కోసం డబ్బు అవసరమవుతుంది. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో భద్ర, కోటి, శివ స్వంగ్లింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ముగ్గురూ ఒక పెద్ద నేరంలో ఇరుక్కుంటారు. అసలు ఆ నేరం ఏంటి? అందులో ఈ ముగ్గురు ఎలా ఇరుక్కున్నారు? శివ-మీనా ప్రేమ కథ ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఎవరో చేసిన నేరానికి అమాయకులు బలైన కథలు ఎన్నో వినుంటాం, చూసుంటాం. 'కృష్ణమ్మ' కూడా ఆ కోవకి చెందినదే. ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ లో ఉండే రివేంజ్ స్టోరీ ఇది. బలమైన ఎమోషన్స్ తో రా అండ్ రస్టిక్ గా దర్శకుడు ఈ సినిమాని మలిచాడు. ఓ భారీ ఫైట్ సీన్ తో సత్యదేవ్ పాత్రని పరిచయం చేస్తూ.. సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత భద్ర, కోటి, శివ ల గతం చూపిస్తారు. వారి మధ్య స్నేహం, శివ-మీనా ప్రేమకథ వంటి సన్నివేశాలతో ప్రథమార్థం నడుస్తుంది. హీరో లవ్ ట్రాక్ మాత్రం తేలిపోయింది. విరామ సన్నివేశాలకు ముందు వరకు ఫస్టాఫ్ లో పెద్దగా మెరుపులు లేవనే చెప్పాలి. ముగ్గురు స్నేహితులు స్వంగ్లింగ్ చేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయి, ఓ పెద్ద కేసులో ఇరుక్కునే సన్నివేశాలు మాత్రం మెప్పించాయి. విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి కలిగేలా చేశాయి. ఇక సెకండాఫ్ అంతా సీరియస్ టోన్ లోనే ఉంటుంది. చేయని నేరాన్ని ఒప్పించడం కోసం వారిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసే సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. వారు పోలీసులపై తిరగబడే సన్నివేశాలు, జైలు నుంచి బయటకు వచ్చాక చేసే హత్యలు థ్రిల్ ని పంచుతాయి. క్లైమాక్స్ ఊహలకు తగ్గట్టుగా ఉన్నప్పటికీ.. దానిని ఎమోషనల్ మలచిన తీరు బాగుంది.
తాను ఎంచుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ప్రేక్షకులను మెప్పించేలా దానిని తెర మీద చూపించడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన కాలభైరవ.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
భద్ర పాత్రలో మరోసారి తన సజహమైన నటనతో సత్యదేవ్ మ్యాజిక్ చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన టాప్ క్లాస్ లో ఉంది. కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణ బూరుగుల కూడా ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అతిర, అర్చన అయ్యర్, నందగోపాల్, రఘు కుంచే తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
బలమైన ఎమోషన్స్ తో రా అండ్ రస్టిక్ ఫిల్మ్ గా రూపొందిన 'కృష్ణమ్మ' ఆకట్టుకుంది. కథలో కొత్తదనం లేనప్పటికీ భావోద్వేగాలు, సహజత్వం ఈ సినిమాని నిలబెట్టాయి.
రేటింగ్: 2.75/5
Also Read