విలన్ గా అల్లు అర్జున్.. రిస్క్ చేస్తున్నాడా..?
on May 7, 2025
ఇటీవల స్టార్ హీరోలు నెగెటివ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విలన్ గా నటిస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్, యశ్ వంటి స్టార్స్ చేరారు. 'జైలవకుశ'లో జై అనే నెగటివ్ రోల్ చేశాడు ఎన్టీఆర్. అలాగే యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోనూ మెయిన్ విలన్ ఎన్టీఆర్ అనే టాక్ ఉంది. అలాగే యశ్ కూడా 'రామాయణ' చిత్రంలో రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ లిస్టులో చేరబోతున్నాడని తెలుస్తోంది. (Allu Arjun)
'పుష్ప-2'తో సంచలనం సృష్టించిన్ అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాని అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో అలరించనున్నాడని వినికిడి.
మొదట ఈ కథను అట్లీ మల్టీస్టారర్ కథగా రాసుకున్నాడని, ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం డ్యూయల్ రోల్ కథగా మార్చాడని ప్రచారం జరిగింది. ఇది ఇద్దరు ట్విన్ బ్రదర్స్ మధ్య నడిచే కథ అని టాక్. ఒక బ్రదర్ హీరో కాగా, ఇంకో బ్రదర్ విలన్ అన్నమాట. విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. బన్నీ నెవర్ బిఫోర్ లుక్ లో తన విలనిజాన్ని చూపించబోతున్నాడని అంటున్నారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్రలో నెగెటివ్ ఛాయలు కనిపిస్తాయి. కానీ, పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్న మొదటి సినిమా ఇదే అని చెప్పవచ్చు. పుష్పతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. ఇప్పుడు హీరోగా, విలన్ గా డ్యూయల్ రోల్ లో కనిపించి.. నటునిగా ఇంకెన్ని అవార్డులు, రివార్డులు అందుకుంటాడో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
