'ఆవేశం' మూవీ రివ్యూ
on May 9, 2024
మూవీ : ఆవేశం
నటీనటులు: ఫహద్ ఫాజిల్, హిప్ స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు
ఎడిటింగ్: వివేక్ హర్షన్
మ్యూజిక్: శుసిన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్
నిర్మాతలు: నజ్రియా నాజిమ్, అన్వర్ రషీద్
రచన, దర్శకత్వం: జీతూ మాధవన్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ :
బెంగుళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేందుకు కేరళకి చెందిన బిబి (మిథున్ జెఎస్), శాంతన్(రోషన్ షానవాస్), అజు(యూట్యూబర్ హిప్ స్టర్) వస్తారు. ఈ ముగ్గురు ముందు తెలియకపోయినా అక్కడికి వెళ్ళాక కలిసిపోతారు. అయితే అదే కాలేజీలోని సీమియర్ బ్యాచ్ వారిని ర్యాగింగ్ పేరుతో తీవ్రంగా అవమానిస్తారు. అక్కడ వారికి సపోర్ట్ లేకపోవడంతో ఆ ముగ్గురు కలిసి లోకల్ గూండా రంగ(ఫహద్ ఫాజిల్) ని సంప్రదిస్తారు. రంగది డిఫరెంట్ క్యారెక్టర్. ప్రేమ, కోపం అన్నీ ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు. ర్యాగింగ్ విషయం తెలుసుకున్న రంగ ఆ సీనియర్ గ్యాంగ్ కి బుద్ధి చెప్తాడు. దాంతో అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ వారి హావా సాగుతుంది. తర్వాత చదువు నిర్లక్ష్యం చేయడంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతారు. దాంతో కాలేజ్ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. ఇక ఆ ముగ్గురు రంగాకి దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కానీ రంగా వారిని వదిలిపెట్టడు. మరి ఆ ముగ్గురు ఏం చేశారు? మొదట ఆ ముగ్గురికి సపోర్ట్ చేసిన రంగానే వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ర్యాగింగ్ అనేది మాములుగా ఉంటుంది. అయితే కొంతమంది సీనియర్స్ చేసే ర్యాగింగ్ కి తట్టుకోలేక కొత్తగా వచ్చిన విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. వారిలోని తిరుగుబాటు కొన్నిసార్లు వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. దానినే తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. తమకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ముగ్గురు కుర్రాళ్ళు కలిసి రంగా అనే రౌడీతో డీలింగ్ కుదుర్చుకోవడం.. అతను సీనియర్స్ కి బుద్ది చెప్పడం అంతా బాగుంటుంది.
రంగా పాత్రకు నెగెటివ్ షేడ్స్ తో పాటు కామెడీ, అతిగా స్పందించే తీరు అన్నీ కలిసి ప్రేక్షకుడికి నచ్చేస్తుంది. అతను నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే ఉత్సుకత సీన్ మారే కొద్ది పెరిగిపోతుంది. ముగ్గురు కుర్రాళ్ళతో కలిసి రంగా చేసే సీన్లు సాధారణంగా ఉన్నా .. ఫహద్ ఫాజిల్ ఎనర్జీని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్ పర్సెంట్ కూడా తగ్గకివ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు. గ్యాంగ్ స్టర్ గా రంగా ఎలా మారాడని తెలిపే సీన్లు కాస్త స్లోగా అనిపిస్తాయి.
సినిమా ప్రథమార్ధంలో మొదటి ముప్పై నిమిషాలు మాములుగా సాగుతుంది. ఎప్పుడైతే రంగా పాత్ర పరిచయం అవుతుందో అక్కడి నుండి కథ పరుగులు తీస్తుంది. మన తెలుగు సినిమాలలోని కొన్ని సీన్లని వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. అవేంటనేది 'ఆవేశం' చూస్తేనే తెలుస్తుంది. కథ సెకండాఫ్ లో కాస్త స్లోగా సాగినా క్లైమాక్స్ ముగించిన తీరు కన్విన్సింగ్ గా ఉంటుంది. యాక్షన్ సీన్లకి కొదవలేదు. రంగా గ్యాంగ్ కి అతడి ప్రత్యర్థి గ్యాంగ్ కి మధ్య వచ్చే ఫైట్ సీన్లు మెప్పిస్తాయి. మదర్ సెంటిమెంట్ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చింది. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శుసిన్ శ్యామ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది.
నటీనటుల పనితీరు:
కాలేజ్ కుర్రాళ్ళుగా హిప్ స్టర్, మిథున్, రోషన్ చక్కగా నటించారు. గ్యాంగ్ స్టర్ రంగా పాత్రలో ఫహద్ ఫాజిల్ నటన మరో స్థాయిలో ఉంది. మొదటి ముప్పై నిమిషాల తర్వాత సినిమా మొత్తం రంగా పాత్రే కన్పిస్తుంది. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా..
ఫహద్ ఫాజిల్ ఆవేశం ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
రేటింగ్ : 3.25/5
- దాసరి మల్లేశ్
Also Read