సర్దార్ సెట్‌లో అగ్నిప్రమాదం... 'ఇన్సురెన్సు' కుట్ర?
on Apr 25, 2016
సర్దార్ - గబ్బర్ సింగ్ సినిమా కోసం హైదరాబాద్ రోడ్ నెం.25 లోని భూత్ బంగ్లాలో ఓ భారీ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి ఆధ్వర్యంలో.. వందల మంది కార్మికులు రెండు నెలల పాటు శ్రమించి వేసిన సెట్ అది. దాదాపుగా రూ.5 కోట్ల వరకూఖర్చయ్యిందని చిత్రబృందమే చెప్పింది. అయితే ఈ సెట్ ఇప్పుడు మంటల్లో ఆహుతి అయ్యింది. షార్ట్ సర్య్మూట్ కారణంగా సర్దార్ సెట్ కాలిపోయింది. పోలీసులు ఈ విషయంలో కేస్ కూడా నమోదు చేశారు. అయితే ఈ సెట్ కాలిపోవడం యాదృచ్చికమా? లేదంటే కావాలని చేసిందా? అనే విషయంలో ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భారీ సెట్ వేసినప్పుడు ఇన్సురెన్సు క్లయిమ్ చేయడం రివాజు. సర్దార్ సెట్ రూ.5 కోట్లతో వేశామని చిత్రబృందమే చెప్పింది. కాబట్టి ఇన్సురెన్సు క్లయిమ్ చేసుంటారు. ఇప్పుడు సర్దార్ సినిమా అయిపోయింది. సెట్ మొత్తం పీకేయాల్సిన పరిస్థితి. సెట్ తీసేస్తే.. కర్రముక్కలు, అట్ట ముక్కలు తప్ప ఏం మిగలదు. అందుకే.. అగ్నికి ఆహుతి అయితే కనీసం ఇన్సురెన్స్ వస్తుందన్న ఆశతో.. ఈ సెట్‌ని కావాలని కాల్చేశారా?? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్దార్ సెట్లో ఎలాంటి సెక్యురీటీ లేకపోవడం.. సెట్ కాలిపోయిందన్న సమాచారం పోలీసులకు ఆలస్యంగా అందడం, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరేలోపే... మంటల్లో సెట్ పూర్తిగా కాలిపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడ షూటింగ్ లేనప్పుడు.. సెట్‌కి పవర్ సప్లయ్ ఎందుకిచ్చారు?? అన్నదే అనుమానించదగిన విషయమే. మొత్తమ్మీద... సర్దార్ సెట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సెట్ నిజంగానే కాలిపోయిందా? లేదంటే ఎవరైనా కాల్చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజ నిర్థాకణ చేయాల్సింది వాళ్లే ఇక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



