భారత సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రం.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో హీరో అతనేనా?..
on Sep 15, 2021
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్‌ఆర్' మూవీతో బిజీగా ఉన్నారు. 'బాహుబలి' తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో పాటు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ కలిసి నటిస్తుండటంతో 'ఆర్ఆర్‌ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోన్న ఈ సినిమా.. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే 'ఆర్ఆర్‌ఆర్' తర్వాత రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది.
మహేష్ బాబుతో ఓ మూవీ చేస్తానని రాజమౌళి గతంలో ప్రకటించారు. దీంతో 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని అందరూ భావిస్తున్నారు. అయితే రాజమౌళి తర్వాతి సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రాజమౌళితో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ తెరకెక్కని భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
దీంతో ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ మూవీలో హీరో ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహేష్-రాజమౌళి కాంబోలో రానున్న మూవీ ఇదేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
