ప్రశాంత్ వర్మ సినిమాలో నాగార్జున..!
on Jun 30, 2025
'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. 'హనుమాన్'తో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ గా తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు. ఇప్పుడు 'హనుమాన్'కి సీక్వెల్ గా 'జై హనుమాన్' చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మకి చెందిన ఓ ప్రాజెక్ట్ లో నాగార్జున నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రచయితగా వ్యవహరిస్తూ తన సినిమాటిక్ యూనివర్స్ లో కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అందులో 'అధీర' ఒకటి. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా ప్రకటన వచ్చింది. 'హనుమాన్' తర్వాత ఈ సినిమా చేయాల్సి ఉంది. అయితే 'హనుమాన్' పాన్ ఇండియా సక్సెస్ సాధించడంతో ప్రశాంత్ ఆలోచనలు మారాయి. అధీర దర్శకత్వ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టికి అప్పగించినట్లు సమాచారం.
'అధీర'ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ అగ్ర నటుడిని కూడా రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి. ఆ నటుడు ఎవరో కాదు.. నాగార్జున. ప్రస్తుతం నాగార్జున కేవలం హీరోగానే సినిమాలు చేయాలనే లెక్కలు వేసుకోకుండా.. నటుడిగా కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇటీవల 'కుబేర'లో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. అలాగే ఆగస్టులో విడుదల కానున్న 'కూలీ'లో నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. మునుముందు కూడా ఇలా నటుడిగా విభిన్నంగా ప్రయత్నిస్తానని నాగార్జున చెప్పాడు. అందుకు తగ్గట్టే.. తాజాగా అధీరకు ఓకే చెప్పినట్లు వినికిడి. మరి ఇందులో నాగార్జున రోల్ ఎలా ఉంటుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
