"జనతా గ్యారేజ్" కోసం కొరటాల ఖర్చు పది కోట్లు??
on Jun 21, 2016
విజయశాతాన్ని బట్టి చిత్రపరిశ్రమలో మనకు లభించే గౌరవం ఆధారపడి ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం. గౌరవంతోపాటు మన పనికి రేటు కూడా పెరుగుతుందని చెప్పకనే చెబుతున్నాడు కొరటాల శివ. తన తొలి "మిర్చి"కి పారితోషికం బదులుగా యువీ క్రియేషవ్స్ వారు బహుమతిగా ఇచ్చిన విల్లాను స్వీకరించిన కొరటాల శివ, అనంతరం "శ్రీమంతుడు" చిత్రానికి అక్షరాలా 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొన్నాడు. ఆ రెండు సినిమాలూ సూపర్ హిట్ అవ్వడంతో కొరటాల కెపాసిటీ పెరిగింది. దాంతో ఎన్టీయార్ ఏరికోరి తన తాజా చిత్రానికి కొరటాలను దర్శకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. హిట్ తర్వాత తదుపరి సినిమాకి రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పు లేదు. కానీ కొరటాల ఏకంగా తన రెమ్యూనరేషన్ ను డబుల్ చేశాడని వినికిడి. "జనతా గ్యారేజ్" సినిమాకి కొరటాల ఏకంగా పదికోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకొంటున్నాడట. స్టార్ హీరోలు సైతం పది పన్నెండు కోట్లలోపు రెమ్యూనరేషన్ అందుకొని సినిమాలు చేస్తున్న తరుణంలో కొరటాల పది కోట్లు తీసుకొంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. మూడో సినిమాకే పది కోట్లకు ఎగబాకాడంటే.. ఇక నాలుగైదు సినిమాల తర్వాత ఓ పదిహేను కోట్లు తీసుకొంటాడేమో చూడాలి!