అప్పుడే మెగాస్టారా? అంతొద్దురాబై !
on Aug 28, 2017
బాలీవుడ్ లో... దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్.
టాలీవుడ్ లో... ఎన్టీయార్, కృష్ణ, చిరంజీవి.
కోలీవుడ్లో... ఎమ్జీయార్, రజనీకాంత్.
మల్లూవుడ్ లో... ప్రేమ్ నజీర్, మమ్ముట్టి, మోహన్ లాల్.
శాండిల్ వుడ్ లో... రాజ్ కుమార్, విష్ణువర్థన్
సినిమా పుట్టాక... భారతీయ తెరపై అవతరించిన సూపర్ స్టార్లు వీరంతా. ఏకంగా ఒక్క సినిమాతో సూపర్ స్టార్లు కాలేదు వీళ్లు. నటులుగా పరిచయమవ్వడానికీ.. ఎదగడానికీ.. నంబర్ వన్ అనిపించుకోవడానికీ వీరందరికీ ఓ ప్రయాణం ఉంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇది గ్రహించాలి. ఒక్క సినిమా చూసి, ‘వీడు మరో అమితాబ్.., వీడు మరో చిరంజీవి, వీడు యంగ్ ఆల్ పసినో..’ అని జడ్జిమెంట్లు పాస్ చేయడం, స్టేట్మెంట్ ఇచ్చేయడంవర్మకు తగదు. ఇది చాలామంది అభిప్రాయం.
‘అర్జున్ రెడ్డి’లో దేవరకొండ విజయ్ అద్భుతంగా నటించిన మాట నిజం. అతని డైలాగ్ టైమింగ్, నాచురల్ పెర్ ఫార్మెన్స్. స్టయిలిష్ బిహేవియర్... నిజంగా సూపర్. ఈ విషయంలో అతడ్ని అభినందించకుండా ఉండలేం. అందుకని.. అతడ్ని ఏకబిగిన మెగాస్టార్ ని చేసేయడం... గత సూపర్ స్టార్ల కష్టాన్ని వెక్కిరించినట్టే లెక్క... అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మన తెలుగులో ఇప్పుడు ప్రతిభావంతులైన కథానాయకులు చాలామంది ఉన్నారు. మహేశ్ బాబు, తారక్, ప్రభాస్, బన్నీ... వీరందరూ సాధారణమైన నటులేం కాదు. వీరు సినీరంగంలోకి తేలిగ్గా రావొచ్చు. కానీ... ఈ స్థాయికి చేరుకోడానికి వారు పడ్డ కష్టం అసామాన్యం. ఊరకే ఎవరికీ జనం జేజేలు పలకరు. ‘నేపథ్యం లేకుండా ఎదిగిన హీరో’ అనే ఒక్క విషయాన్ని పక్కన పెడితే... వీరికంటే... దేవరకొండ విజయ్ ఏ విషయాల్లో గొప్ప? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ముందు వీరందిరినీ దాటుకొని విజయ్ ముందుకెళ్లాలి. వీరికంటే మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలి. అప్పుడు అతడు మెగాస్టార్.
రవితేజ కూడా హైలీ టాలెంటెడ్ హీరోనే... కానీ... నంబర్ వన్ అయ్యాడా?. దానికి కొన్ని అర్హతలుంటాయ్. ఆ అర్హతలు నాడు ఎన్టీయార్లో, మొన్నటివరకూ చిరంజీవిలో కనిపించాయ్. మరి ఇప్పుడు నంబర్ వన్ ఎవరో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. నిజానికి ఈ టాపిక్... దేవరకొండ విజయ్ విషయంలో రావడమే... అతని ఎదుగుదలకు ఓ నిదర్శనం. కానీ... ‘మెగాస్టార్’ అవడానికి ఈ మాత్రం సరిపోదు. ఇంకా చాలా చేయాలి. నటన మాత్రమే కాదు... ఇక్కడ బిహేవియర్ కూడా ముఖ్యమే. అన్నింటినీ మించి ‘సుడి’ (అదృష్టం) ఉండాలి. ఇప్పుడున్న హీరోలందరూ ‘అర్జున్ రెడ్డి’కంటే పెద్ద హిట్లు కొట్టినవాళ్లే.. అందుకని... మెగాస్టార్లు కారు కదా!
Also Read