మరోసారి వేసవి బరిలో అనిల్ రావిపూడి!?
on May 28, 2022
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. తాజాగా `ఎఫ్ 3`తో పలకరించిన అనిల్.. త్వరలో నటసింహం నందమూరి బాలకృష్ణతో జట్టుకట్టనున్నాడు. తండ్రి - కూతురు కథతో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆపై చకచకా చిత్రీకరణ పూర్తి చేసుకుని.. 2023 వేసవిలో తెరపైకి వచ్చే అవకాశముందని అంటున్నారు.
అదే గనుక నిజమైతే.. అనిల్ రావిపూడి వేసవి బరిలో ముచ్చటగా మూడోసారి దిగబోతున్నట్లే. ఇప్పటికే ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. `సుప్రీమ్` (2016), `ఎఫ్ 3` (2022) చిత్రాలతో సమ్మర్ లో సందడి చేశాడు. ఇక బాలయ్య విషయానికి వస్తే గతంలో ఎన్నో సార్లు ఈ సీజన్ లో ఎంటర్టైన్ చేశారు. అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. చివరసారిగా `లయన్` (2015)తో వేసవిలో వినోదాలు పంచిన బాలకృష్ణ.. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఆ సీజన్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నట్లే.
కాగా, బాలయ్య ప్రస్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేనితో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. విజయదశమి కానుకగా తెరపైకి రాబోతోందని చెప్పుకుంటున్నారు.