విజయ్ దేవరకొండతో కృతి శెట్టి రొమాన్స్!?
on May 28, 2022
`లైగర్`, `ఖుషి`, `జన గణ మన`.. ఇలా ఏడాది వ్యవధిలో వరుసగా మూడు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ఆగస్టు 25న `లైగర్`తో పలకరించనున్న విజయ్.. ఇదే సంవత్సరం డిసెంబర్ 23న `ఖుషి`తో ఎంటర్టైన్ చేయనున్నాడు. అలాగే వచ్చే క్యాలెండర్ ఇయర్ ఆగస్టులో `జన గణ మన`తో వినోదాలు పంచనున్నాడు. ఇవన్నీ కూడా తెలుగేతర భాషల్లోనూ సందడి చేయనున్నాయి.
ఇదిలా ఉంటే, వెర్సటైల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లోనూ విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో విజయ్ కి జంటగా కృతి శెట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. స్వాతి, ఈషా రెబ్బా, నివేదా థామస్, అదితి రావ్ హైదరీ - ఇలా తన కథానాయికలను రిపీట్ చేసే అలవాటు ఉన్న ఇంద్రగంటి.. తాజా చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`లో హీరోయిన్ అయిన కృతి శెట్టిని కూడా ఈ జాబితాలో చేర్చబోతున్నాడని సమాచారం. ఒకవేళ కృతి శెట్టిని ఇంద్రగంటి రిపీట్ చేస్తే.. విజయ్, కృతి రూపంలో మరో ఫ్రెష్ పెయిర్ ని తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నట్లే.