'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా సమంత!
on Jun 29, 2022
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా సమంత పేరు వినిపిస్తోంది.
'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపించింది. ఆలియా కూడా ఓసారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది. కానీ పెళ్లి కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్. ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. ఇక ఇటీవల టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, శ్రీలీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీమ్ మాత్రం ఈ యంగ్ బ్యూటీలను కాకుండా పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోయిన్ నే తీసుకోవాలని భావిస్తోందట. అందుకే సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తారక్-సమంత-కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ తో సమంతనే హీరోయిన్ గా తీసుకోవాలని కొరటాల భావిస్తున్నాడట. సమంతకు ఎప్పటినుంచో సౌత్ లో మంచి క్రేజ్ ఉండగా.. ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్-2' సిరీస్, 'ఊ అంటావా' సాంగ్ తో నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు బాలీవుడ్ ఆఫర్స్ సైతం ఆమెకు వస్తున్నాయి. దీంతో సమంతనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తారక్, కొరటాలతో తనకున్న ఫ్రెండ్ షిప్ తో సమంత కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు.