‘కబాలి’ కాదు...‘కపాలి’
on Oct 6, 2015
తమిళ సినిమాలు అక్కడక్కడ తమిళ కంపు కొడుతూ వుండటం మామూలే. అది చిన్న హీరో సినిమా అయినా, రజనీకాంత్ లాంటి టాప్ స్టార్ సినిమా అయినా తమిళ కంపు మాత్రం కంపల్సరీ. పాతరోజుల్లో అయితే సినిమా టైటిళ్ళు కూడా తమిళ వాసనతో గుబాళిస్తూ వుండేవి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం టైటిల్స్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడుతున్నారు.
తమిళంలో ఎలాంటి టైటిల్ పెట్టినా తెలుగులో మాత్రం తెలుగుదనమో, ఇంగ్లీషుదనమో కనిపించేలా టైటిల్స్ పెడుతున్నారు. ఫరెగ్జాంపుల్ రజనీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా చూడండి... తమిళంలో ఆ సినిమా పేరు ‘యంతిరన్’. తెలుగులో మాత్రం ఆ తమిళ తంటాలేవీ లేకుండా ‘రోబో’ అని పెట్టేశారు. అయితే ఇప్పుడు అదే రజనీకాంత్ నటిస్తున్న ఓ సినిమా టైటిల్ ముక్కుపుటాలు పగిలిపోయేలా తమిళ వాసనేస్తోంది. రజనీకాంత్ లేటెస్ట్ తమిళ మూవీ ‘కబాలి’. దీన్ని తెలుగులో కూడా డబ్బింగ్ చేయబోతున్నారు.
తెలుగులో ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలా అని ఆలోచించీ, చించీ తెలుగులో కూడా ‘కబాలి’ అనే టైటిల్‌నే కంటిన్యూ చేయాలని డిసైడ్ చేశారట. నిజానికి ఈ సినిమా అసలు పేరు ‘కపాలి’. తమిళంలో ‘ప’ అనే అక్షరాన్ని ఒక్కోసారి ‘బ’ అని పలుకుతారు. అందువల్ల తమిళ వాసన ప్రకారం ‘కబాలి’ అని పిలవటం మామూలే. అదే తెలుగులో అయితే ఈ సినిమాకి ‘కపాలి’ అనే టైటిల్ పెట్టాలి. తెలుగువాళ్ళకి ‘కపాలి’ అంటే అర్థమవుతుంది. ‘కబాలి’ అంటే తమిళ కంపు కొడుతూ వుంటుంది. అంచేత ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి ‘కపాలి’ అని పేరు పెట్టి, తమిళ కంపు తగ్గించండి మహాప్రభో అనే మొత్తుకోళ్ళు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి.