క్రేజీ స్టార్ తో పవర్ స్టార్!
on Jul 11, 2016
తెలుగులో పవర్ స్టార్ కి ఎంత భారీ క్రేజ్ ఉందో.. ఇంచుమించుగా అంతే స్థాయిలో తమిళనాట స్టార్ డమ్ ఉన్న హీరో అజిత్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా కోసం అజిత్ మునుపటి చిత్రమైన "వేదాలమ్"ను రీమేక్ చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. ఇద్దరూ పబ్లిసిటీ కోరుకోరు, తమ సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనరు. చాలావరకూ సింపుల్ గా జీవించడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇద్దరికీ కోట్లలో అభిమానులున్నారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా వీలుకాదు. అలాంటి క్రేజీ కాంబినేషన్ ను సెట్స్ మీదకు తీసుకురావాలంటే ఏ దర్శకధీరుడో పూనుకోవాల్సిందే.
అయితే.. అసలు కలిసి నటించడానికి ఈ ఇద్దరూ ఒప్పుకొంటారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం నిన్న లండన్ లో దొరికేసింది. లండన్ లో "యుక్తా వేడుకలకు" హాజరైన పవన్ కళ్యాణ్ ను ఓ అభిమాని "అజిత్ తో కలిసి నటిస్తారా?" అని అడగ్గా.. వెంటనే పవన్ కళ్యాణ్ "నాకు ఆ కాంబినేషన్ లో సినిమా చేయమని ఎవరూ అడగలేదు, ఒకవేళ ఆ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను" అని సమాధానమిచ్చాడు. సో, పవర్ స్టార్ స్వయంగా సమ్మతం తెలిపాడు కాబట్టి.. మన కథారచయితలు, దర్శకులు పవన్-అజిత్ లకు సరిపడే స్టోరీ తయారు చేసుకోవడమే తరువాయి!