'రామారావు'తో చిందేయనున్న ఇలియానా!
on Feb 1, 2022

చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురు హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ తో సందడి చేస్తున్నారు. వారిలో తమన్నా, కాజల్, పూజ హెగ్డే వంటి వారున్నారు. ముఖ్యంగా తమన్నా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పిస్తోంది. త్వరలో విడుదల కానున్న 'గని' సినిమాలోనూ 'కొడితే' అంటూ సందడి చేయనుంది. ఇక ఇటీవల 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ' అంటూ సమంత చేసిన సందడి అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. సమంత ఇన్స్పిరేషన్ తో గోవా బ్యూటీ ఇలియానా కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది.
ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శరత్ మండవ దర్శకుడు. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా, దానికోసం రవితేజ ఇలియానా పేరుని సూచించాడట. దీంతో మేకర్స్ ఇలియానాను సంప్రదించగా ఆమె ఈ స్పెషల్ సాంగ్ లో చిందేయడానికి ఓకే చెప్పిందని సమాచారం. 'కిక్' కాంబినేషన్ లో రానున్న ఈ స్పెషల్ సాంగ్ ఆడియన్స్ కి ఎంతటి కిక్ ఇస్తుందో చూడాలి.
కాగా, ఇలియానా చివరిగా కనిపించిన రెండు తెలుగు సినిమాల్లోనూ రవితేజే హీరో కావడం విశేషం. 2012 లో విడుదలైన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలో రవితేజ సరసన నటించిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. మళ్ళీ 2018 లో విడుదలైన రవితేజ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోని'తో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా పరాజయాన్ని చూసింది. దీంతో అప్పటినుంచి ఇక తెలుగు సినిమాల్లో కనిపించని ఇలియానా ఇప్పుడు మరోసారి రవితేజ సినిమాలో చిందేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



