సావిత్రి కాకుండా ఇతర తారల గురించి ఎందుకు గొప్పగా మాట్లాడరు?
on Nov 11, 2021

ఒక టైమ్‌లో జయసుధ, జయప్రద, శ్రీదేవి తెలుగు చిత్రసీమకు ఏలారు. గ్లామర్ విషయంలో శ్రీదేవి, జయప్రద ముందు జయసుధ ఆగరు. జయప్రదను అయితే సత్యజిత్ రే లాంటి లెజండరీ డైరెక్టర్ 'ఇవాళ దేశం మొత్తమ్మీద జయప్రద లాంటి అందమైన తార ఇంకొకరు లేరు' అనేశారు. ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా శ్రీదేవి కోట్లాదిమంది కలలరాణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి సౌందర్యరాశులతో పోలిస్తే జయసుధ అందగత్తె కాదు. అయినా టాప్ యాక్ట్రెస్‌గా వాళ్లతో పాటు ఆమె రాణించారు. సహజనటి అని అందరిచేతా ప్రశంసలు పొందారు.
కాగా, తెలుగు చిత్రసీమలో మహానటి అనే గొప్పమాటను సావిత్రికి మాత్రమే ఆపాదిస్తూ అందరూ మాట్లాడుతుంటారు. సావిత్రి తర్వాత ఎంతోమంది నటీమణులు గొప్ప గొప్ప సినిమాలు, పాత్రలు చేశారనీ, కానీ వారికి సావిత్రి లాంటి గుర్తింపు రాలేదనీ జయసుధ బాధపడతారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "సావిత్రి గారి తర్వాత అంత గొప్పసినిమాలు వాణిశ్రీ చేశారు. కానీ ఎంతమంది వాణిశ్రీ గురించి చెబుతారు! శారదగారు సెకండ్ ఇన్నింగ్స్ అంటే హీరోయిన్ గా కాకుండా మదర్, పోలీస్ ఆఫీసర్ లాంటి చాలా పవర్ పుల్ పాత్రలు చేశారు. పరుచూరి బ్రదర్స్ ఆమెకు అలాంటి పాత్రలను సృష్టించారు. విమన్ ఇన్ తెలుగు సినిమా అని తీసుకుంటే సావిత్రి తర్వాత ఇంకెవరి గురించీ గొప్పగా మాట్లాడటం లేదు. ఆమె తర్వాత కూడా చాలా మంది చేశారు కదా.. వాళ్లకీ గౌరవం దక్కాలి కదా. వాణిశ్రీ, శారదల తర్వాత సీరియస్ రోల్స్ చేయడానికి నేను వచ్చాను. పెద్ద హీరోయిలతో చేస్తూ చిన్న హీరోలతో చేస్తావెందుకు అని నన్ను అన్నవారు కూడా ఉన్నారు. కేవలం పాత్రలు నచ్చే నేనవి చేశాను." అని ఆమె చెప్పారు.
శ్రీదేవి చిన్నప్పటి నుంచి సినిమా రంగంలో ఉన్నా హీరోయిన్ గా జయసుధ తర్వాతే వచ్చింది. "నేనొచ్చిన ఏడాది తర్వాత అనుకుంటాను, జయప్రద వచ్చింది. అంత అందమైన శ్రీదేవి, జయప్రద లాంటి వారు ఉన్నపుడు జయసుధ అనే వ్యక్తి ఎలా మనగలుగుతుంది? అందుకే మంచి పాత్రలను ఎంచుకుని చేసేదాన్ని. అలాంటి పాత్రలు చేయబట్టే ఇన్నేళ్లు ఉండగలిగాను. మదర్ పాత్రలు చేసేటప్పుడు కూడా పర్‌ఫార్మెన్స్ కు అవకాశమున్నవాటినే ఎంచుకున్నాను. 'గోవిందుడు అందరివాడేలే', 'అమ్మా నాన్న తమిళ అమ్మాయి', 'ఎవడు'... ఇలా ఏ సినిమా చేసినా నాకు పేరు తెచ్చే పాత్రే అయింది. ఆ పాత్రలు ఎవరైనా చేయవచ్చు... కానీ ఈమె చేస్తేనే ఈ పాత్ర పండుతుంది అనే భావనలో డైరెక్టర్లు కూడా ఉండేవారు." అని చెప్పుకొచ్చారు జయసుధ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



