రాజేంద్రప్రసాద్‌కు అమ్మాయి వేషం తెచ్చిన తంటా! ముద్దులు పెట్టించుకున్న అబ్బాయిలు!!
on Jul 13, 2021

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గూడురు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులవి. లాగూ, చొక్కా వేసుకొని ఆ కాలేజీలో చేరింది ఆయనొక్కరే! ఫస్ట్ ఇయర్ నిక్కరు, చొక్కా తోటే కాలేజీకి వెళ్లేవారు. అంటే అక్కడ అందరికంటే ఆయనే చిన్నవారన్న మాట! ఓసారి కాలేజీ యానివర్సరీ డే ఫంక్షన్ సందర్భంగా స్టూడెంట్స్ అంతా కలిసి ఒక నాటకం వేయాలనుకున్నారు. అందులో హీరోయిన్ వేషం ఎవరు వేస్తే బాగుంటుందని ఆలోచించి, చివరకు రాజేంద్రప్రసాద్‌ను వెయ్యమన్నారు. ఛాన్స్ వచ్చింది కదా అని ఆయన రెడీ అయిపోయారు. రిహార్సల్స్ చేశారు. యానివర్సరీ డేకి ఆ నాటకాన్ని దిగ్విజయంగా ప్రదర్శించారు.
ఆ తర్వాత వచ్చిపడ్డాయి అష్టకష్టాలు. నాటకం అయిపోయాక రాజేంద్రప్రసాద్ గ్రీన్ రూమ్‌లోకి వెళ్లారు. అప్పటికే ఆయన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఆయనను చిలకా అని పిలుస్తూ ముద్దులివ్వమని గొడవచేశారు. వాళ్ల ప్రిన్సిపాల్ ఈ గొడవంతా చూసి, వాళ్లను మందలించడానికి ప్రయత్నించారు. అయినా సరే.. వాళ్లు ఒప్పుకోలేదు. ప్రిన్సిపాల్‌తో దెబ్బలాడి, చివరకు పర్మిషన్ తీసుకొని మరీ రాజేంద్రప్రసాద్‌తో ముద్దులు పెట్టించుకున్నారు. ఇక హాస్టల్ సెక్రటరీ అయితే, రౌండ్స్‌కి వచ్చినప్పుడు, మర్యాదగా ముద్దిస్తావా, లేదా? అని బెదిరించి మరీ ముద్దు పెట్టించుకొని, ఈ విషయం బయటకు చెప్పొద్దని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక, తొలిసారి 'వివాహ భోజనంబు' చిత్రంలో ఆడవేషం వేసే అవకాశం వచ్చింది రాజేంద్రప్రసాద్‌కు. అప్పుడు కాలేజీ నాటి సంఘటన ఆయనకు గుర్తుకు వచ్చింది. అప్పుడు ఎలాగైతే ఆయన స్టూడెంట్ ఫ్రెండ్స్ అంతా ముచ్చటపడి ముద్దులు పెట్టించుకున్నారో.. ముద్దులు పెట్టించుకోకపోయినా.. ప్రేక్షకులు ఆయన వేషానికి కురిపించిన ఉత్తరాలు చూసి, ముద్దులు పెట్టించుకున్న అనుభూతిని ఆయనకు కలుగజేశాయి. తర్వాత మరోసారి 'మేడమ్'లో చాలా సేపు ఆడవేషంలోనే కనిపించి ఆయన మనల్ని మురిపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



