మోహన్‌బాబు 'చిట్టెమ్మ మొగుడు' చేస్తూ ఇక నటించకూడదని నిర్ణయించుకున్న వరలక్ష్మి!
on Aug 10, 2021
.jpg)
తెలుగునటి వరలక్ష్మి అనగానే చాలామంది అలనాటి నటీమణులు జి. వరలక్ష్మి, యస్. వరలక్ష్మి గుర్తుకువస్తారు. అదే బేబీ వరలక్ష్మి అనండి.. ఒక్కరే గుర్తుకొస్తారు. బాలనటిగా వచ్చిన పేరు.. ఆమె పెద్దయి, పెళ్లయి, పిల్లల్ని కన్న తర్వాత కూడా ప్రేక్షకుల దృష్టిలో ఆమె బేబీ వరలక్ష్మి మాత్రమే! వరలక్ష్మి పుట్టింది భీమవరంలో. కానీ ఆమెకు ఏడాది వయసప్పట్నుంచే చెన్నైలో పెరిగారు. చిన్నప్పుడే సినిమా రంగంలోకి రావడంతో ఆమె ఎక్కువగా చదువుకోవడానికి వీలుపడలేదు. స్కూల్లో ఆరో క్లాస్ వరకే చదువుకున్నారు. తర్వాత ప్రైవేటుగా టెన్త్ పూర్తి చేశారు.
వరలక్ష్మి భర్త తమిళియన్. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు, ఒక డాక్టర్.. జనరల్ ఫిజీషియన్. మొదట ఆయన వరలక్ష్మిని ప్రేమించారు. ప్రపోజ్ చేశారు. ఆమె యాక్సెప్ట్ చేశారు. అలా వారి పెళ్లయింది. మ్యారేజ్ తర్వాత కూడా వరలక్ష్మి సినిమాల్లో నటిస్తూ వచ్చారు. అయితే తెలుగు సినిమాల కంటే కన్నడ సినిమాల్లోనే ఎక్కువ చేశారు. ఆమె తెలుగులో చాలాకాలం నటించకపోవడానికి కారణం 'చిట్టెమ్మ మొగుడు'. ఆ సినిమాలో మోహన్‌బాబు, దివ్యభారతి హీరో హీరోయిన్లు. దివ్యభారతి ఫ్రెండ్ క్యారెక్టర్‌ను వరలక్ష్మి చేశారు.
ఆ సినిమాలో ఒక సందర్భంలో ఆమె గర్భవతిగా కనిపిస్తారు. ఒక సీన్‌లో ఆమె అరటి తొక్కమీద కాలువేసి, జారి కిందపడిపోవాలి. ఆ మూవీకి డైరెక్టర్ కోదండరామిరెడ్డి. ఒకటి, రెండు.. మూడు.. ఇట్లా 11 టేకులయ్యాయి కానీ సీన్ ఓకే కావట్లేదు. దాంతో వరలక్ష్మి కూర్చుండిపోయి, ఏడవడం మొదలుపెట్టారు. అందరూ వచ్చి "ఏమైందమ్మా.. ఏమైనా దెబ్బతగిలిందా?" అని అడుగుతున్నారు. డైరెక్టర్ కూడా అదే అడిగారు. "లేదు సార్" అని చెప్పారు వరలక్ష్మి. "మరెందుకు ఏడుస్తున్నావ్?" అనడిగారు డైరెక్టర్.
"సార్.. ఇన్నిసార్లు పడిపోతున్నాను.. నేను నిజంగానే కడుపుతో ఉన్నాను సార్. మూడో నెల. ఈ టైమ్‌లో ఇలా ఇన్నిసార్లు పడిపోతే నా గర్భం నిలవదేమోనని ఫీల్ వస్తోంది సార్.. నాకు భయమేస్తోంది" అన్నారు వరలక్ష్మి. షాకైపోయారు కోదండరామిరెడ్డి.
"ఏమ్మా ఈ విషయం ముందే చెప్పవా? 11 టేకుల దాకా తీస్తున్నా ఇలా పడుతూనే ఉన్నావా?" అని అడిగారు.
"లేదు సార్.. ఒకట్రెండు టేకుల్లోనే ఓకే అవుతుందనుకున్నాను" అని చెప్పారు వరలక్ష్మి. వెంటనే ఆయన ప్యాకప్ చెప్పేశారు. తీసిన టేకుల్లో ఏ షాట్ బాగా వస్తే దాన్ని ఓకే చేసుకుందామని చెప్పారు. ఆమెను ఇంటికి పంపేశారు.
ఇంటికి వచ్చాక వరలక్ష్మి ఆలోచించారు. 'నాకు ఎప్పుడూ రౌడీలు వెంటపడితే పరిగెత్తే సీన్లు ఎక్కువగా వస్తుంటాయి.. కడుపుతో ఉన్నాను. లోపల బిడ్డ క్షేమంగా ఉండటం ముఖ్యం. ఇంతటితో ఆపుదాం' అనుకుని, అప్పుడు సినిమాలు ఒప్పుకోకూడదని డిసైడ్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఇబ్బంది లేదనుకున్న 'ఆమె', 'ఆడాళ్లా మజాకా' లాంటి కొద్ది సినిమాలు చేశారు. ఆపైన పాపను చూసుకోవాలని చాలా కాలం సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



